పదవ తరగతి పరీక్షల్లో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థని సర్వనాశనం చేసింది. పదవ తరగతి ఫలితాల విషయంలో దశాబ్ద కాలంలో ఇంతటి వైఫల్యం ఎప్పుడూ లేదు. ఇందుకు విద్యామంత్రి నైతిక బాధ్యత వహించకుండా తల్లితండ్రులపైకి నెట్టడం మంత్రి చేతకానితనాన్ని సూచిస్తోంది. విద్యామంత్రి లేకపోవడంతో ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న పదవ తరగతి ఫలితాలను ఆపడం.. విద్య, విద్యార్థుల పట్ల ఉన్న నిర్లక్ష్యం బహిర్గతమవుతోంది.
కోవిడ్ సమయంలో ఇతర రాష్ట్రాలు విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రయత్నించి డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద ఉంచడం పాలనా రాహిత్యానికి నిదర్శనం. అమ్మ ఒడి ద్వారా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఉత్తీర్ణతాశాతాన్ని తగ్గిచడంలో ప్రభుత్వం చొరవచూపడంతో పదవ తరగతి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ హత్యలు ప్రభుత్వ అసమర్థత, అసంబద్ధ విధానాల వల్ల జరిగాయి కావున వీటిని ప్రభుత్వ హత్యలుగా భావించాలి. విద్యార్థులను ఇంగ్లీష్ మీడియంలో చేరాలని బలవంతపెట్టడం దారుణం.
ఐటీ రంగంలో తెలుగువారు ముందుండడం చంద్రబాబు ఘనతే. ప్రభుత్వం పీజీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఎత్తేయడం బాధాకరం. దీన్నిబట్టి చంద్రబాబులాంటి విజనరీ ముఖ్యమంత్రికి , జగన్ లాంటి ప్రిజనరీ ముఖ్యమంత్రికి తేడా తెలుస్తోంది. అభ్యసనస్థాయి, విద్యార్థుల వ్యక్తిగత సామర్థ్యాలు పరిశీలిస్తే ఎంతగా పడిపోయిందో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో విద్యావిధానపరమైన లోపాలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వం కేవలం పెయింట్లకి, ప్రచారాలకి మాత్రమే ఖర్చు పెట్టుకుంటున్నారు. విద్యా ప్రమాణాలు పెంచాలి, ఉపాధ్యాయ ఉద్యోగాల సంఖ్య పెంచాలి’’ అని సూచించారు.