Site icon 123Nellore

కాపులంటే ఎందుకంత కక్ష జగన్? ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్

The Jagan government is against the Kapus

వైసీపీ పాలనలో కాపులకు జరిగిన న్యాయం కంటే అన్యాయమే ఎక్కువని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కాపులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.  రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లు, కాపు భవన్ లు  నిలిపివేసినట్లుగానే పవన్ కళ్యాణ్ సినిమాను కూడా నిలిపివేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు విడుదలయ్యాయని, కానీ ఏ సినిమాకి లేని ఆంక్షలు ఒక్క పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రమే ఎందుకన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఒక్క పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది పెట్టేందుకు వేలాదిమంది సినీ కార్మికుల జీవితాల్ని ఇబ్బందులకు గురి చేస్తోందని,  కాపులకు ప్రభుత్వం అందించే పధకాల నుంచి పవన్ కళ్యాణ్ సినిమా వరకు అన్నింటిపై జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యల్ని బట్టి  ఇది కాపు వ్యతిరేక ప్రభుత్వమని కాపులు గ్రహించాలని విన్నవించారు.  చంద్రబాబు కాపులకు పెద్దపీట వేస్తే జగన్ రెడ్డి కత్తిపీట వేశారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో కాపు విద్యార్థులకు విదేశీ విద్యకోసం ఏటా రూ.1,500 కోట్ల నిధులను ఖర్చు చేస్తే… వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‎ విదేశీ విద్యను రద్దు చేసి.. విదేశాల్లో చదువుకుంటున్న ‎కాపు విద్యార్ధుల భవిష్యత్‌ను అగమ్యగోచరంగా మార్చిందన్నారు.

వైసీపీ పాలనలో కాపులకు ఏం చేశారో గుండెమీద చేయివేసుకుని ముఖ్యమంత్రి  చెప్పగలరా? అని నిలదీశారు. చంద్రబాబు కాపులకు అన్నంపెడితే జగన్ రెడ్డి వారి కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లను కల్పిస్తే వాటిని కూడా జగన్‌ రద్దు చేసి కాపులపట్ల తనకున్న ధ్వేషాన్ని బహిరంగంగానే చాటుకున్నారని విమర్శించారు.  ఇది కాపు వ్యతిరేక ప్రభుత్వమని కాపులు గుర్తించాలని విజ్ణప్తి చేశారు.

Exit mobile version