Site icon 123Nellore

జగన్ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు : వర్ల రామయ్య

రాష్ట్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పద్మవ్యూహంలో చిక్కుకుపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో కీలకమైన ఆరుగుర్ని తొలగిస్తే ఆయన పదవికి ముప్పు తప్పేలా లేదన్నారు. మంత్రివర్గ ప్రక్షాళన పేరుతో ఆయన ఒకరకంగా తేనేతుట్టెనే కదిలించారన్నారు. 2019 జూన్ 6న జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారని, రెండున్నరేళ్ల తర్వాత పూర్తి మంత్రివర్గాన్ని మార్చి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే కీలకమైన ఓ ఆరుగురు మంత్రులను తొలగిస్తే ఆయన పీఠం కదిలిపోయేలా ఉందని ఆరోపించారు. శుక్రవారం నాటి నంద్యాల సభలో ముఖ్యమంత్రి ఎవరూ నా వెంట్రుక పీకలేరు అన్నారన్నారు.

తాజా పరిస్థితులను బేరీజువేస్తే ఆ మాట మంత్రివర్గం విషయంలో ఆయనకే వర్తించి ఎవరినీ పీకలేని పరిస్థితులు నెలకొన్నాయని ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డిని తొలగిస్తే జగన్ కు పదవీగండం ఖాయమన్నారు. బొత్స సత్యనారాయణకు  తెరవెనుక అగ్గిపెట్టడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఈయనను తొలగిస్తే అసంతృప్తివాదులను కలుపుకుని సీఎంపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారని తెలిపారు. ధర్మాన కృష్ణదాస్ ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జలను కలిసి తన కుటుంబానికి  కాకుండా మరొకరికి ఆ జిల్లాలో మంత్రి పదవి ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు.

ఆదిమూలపు సురేష్ గతంలో ఇన్ కంటాక్స్ విభాగంలో పనిచేసిన నేపథ్యంలో డిల్లీలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడి)లోని కొందరు అధికారులతో ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ముఖ్యమంత్రిపై ఉన్న ఈడి కేసుల విచారణ వేగవంతమవుతున్న నేపథ్యంలో సురేష్ ను తొలగిస్తే లాబీయింగ్ చానల్ దెబ్బతిని మొదటికే మోసం రావచ్చని ఆరోపించారు.  బాలినేని జగన్ కుటుంబంలో విభేదాల తర్వాత తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల హైదరాబాద్ వెళ్లిపోయాక జగన్ వద్ద ఉన్న ఏకైక కుటుంబీకుడుగా ఉన్నారన్నారు. ఈయనను కదిలిస్తే ఆ డొంక కదిలి సీఎం మరికొన్ని కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంద్నారు. బూతులమంత్రి కొడాలి నానిని చంద్రబాబును తిట్టడం కోసమే ఆ సామాజికవర్గం నుంచి ఇతడ్ని పెట్టుకున్నారన్నారు.

 

Exit mobile version