పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారు. పోలవరం ప్రాజెక్టు వైఫల్యం జగన్మోహన్ రెడ్డిదేనని, పోలవరం ప్రాజెక్టుకు ఎందుకు నిధులు సాధించలేకపోతున్నారు? టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. డిసెంబర్ 20 కల్లా పూర్తి చేసి నీరు పారిస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు పారించలేకపోయారని అన్నారు. జగన్ చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటికొస్తున్నాయని, తన బంధువు పీటర్ చేత నిర్మాణ దర్యాప్తు చేయించడంలో అర్థంలేదన్నారు. మూడు సంవత్సరాల్లో 3% పనులు కూడా పూర్తిచేయలేదని, తెలుగుదేశం అధికారంలోకి రాగానే పోలవరం వద్ద శిలాఫలకాలు తప్ప ఏమీ లేవని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 72 శాతం పూర్తి చేశామని, అవగాహన, ఇంగితజ్ఞానంలేని వ్యక్తులు మంత్రులు కావడం దౌర్భాగ్యమని మండిపడ్డారు.
‘‘అప్రోచ్ ఛానల్ సరిగా చేయకపోవడంతో నీరు ఆగి పోలవరానికి గండి పడింది. ప్రాజెక్టులమీద ఏమాత్రం అవగాహన లేని మంత్రులు మీడియా మీద విరుచుకుపడుతున్నారు. జగన్ పాలనతో రాష్ట్రం సర్వనాశనమైంది. ప్రాజెక్టు పూర్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టులను ప్రతిపక్ష నేతలు పరిశీలించకూడదా?. ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ ఎందుకు అమలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తెలివితక్కువ తనంవల్ల, అహంకారపూరిత విధానాల వల్ల పోలవరం ప్రాజెక్టుకు ఈ దుర్గతి పట్టింది. 21కల్లా పూర్తి చేస్తాం, 22కల్లా పూర్తి చేస్తాం, 23 కల్లా పూర్తి చేస్తామని చెబుతూ వస్తారు.
24కల్లా వీరే ఉండకుండా ఇంటికి పోతారు. నేడు జరిగిన నష్టానికి వైసీపీదే బాధ్యత. టీడీపీ హయంలో వేగంగా జరుగుతున్న ప్రాజెక్టుని వైసీపీ ప్రభుత్వం తెలివి తక్కువతనం వల్ల ఆగిపోయింది. రివర్స్ టెండరింగ్ పేరుతో దోపిడీ చేశారు. మూడు సంవత్సరాల్లో రూ.45 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడతామని బడ్జెట్ లో పెట్టిమూడు సంవత్సరాల్లో పది వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. .ఎంతసేపు చంద్రబాబు, టీడీపీ మీద ఏడ్వడం, గగ్గోలు పెట్టడం తప్ప పోలవరం నిర్మాణ పురోగతి లేదు. వైసీపీ చరిత్ర సమాధి కాబోతోంది’’ అని దుయ్యబట్టారు.