వరుస ఎంవోయూలతో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ బృందం దుబాయ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే రూ.3వేలకు కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు ఎంవోయూలు కుదుర్చుకుంది. అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏసియా పరిశ్రమతో మరో కీలక ఒప్పందానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, గోడౌన్ల నిర్మాణం(గిడ్డంగులు), వాతావరణ ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ రంగాలలో కలిసి పనిచేసేందుకు రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, తబ్రీద్ ఏసియా సీడీవో(చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్) ఫ్రాన్ కో-యిస్ జావియర్ బాల్ లు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఏ విధంగా సానుకూలమో ఎలా ప్రచారం, మార్కెటింగ్ చేయాలనే అంశాలపై మంత్రి మేకపాటి అబుదాబీలో రోడ్ షో నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ఎలాంటి విధానాలు అవలంభిస్తుందో మంత్రి మేకపాటి వెల్లడించారు. అబుదాబీలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ను కలిశారు.
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సాగుతున్న దుబాయ్ పర్యటన వెనుక గల ఎంబసీ సహకారంపై మంత్రి మేకపాటి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో గల అవకాశాల గురించి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అబుదాబీలోని ఇండియా ఎంబసీలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఏపీలో ఏఏ రంగాలలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయో కూలంకషంగా ఏపీఈడీబీ సీఈవో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, మిడిల్ ఈస్ట్ అండ్ ఫార్ ఈస్ట్ ప్రత్యేక ప్రతినిధి జుల్ఫీ రావ్జీ, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ మారిటైమ్ డిప్యూటీ సీఈవో రవి, అధికారులు పాల్గొన్నారు.