Site icon 123Nellore

గొంతు గరగర తగ్గాలంటే..?

గొంతుకి వచ్చే సమస్యల్లో.. గొంతు బొంగురుపోవడం తరచుగా వచ్చే సమస్య. గట్టిగా మాట్లాడటం, అరవడం  వల్ల స్వరతంత్రులు ఒకదాంతో మరొకటి గట్టిగా రాసుకుపోయి ఈ సమస్య వస్తుంది.  వైరస్, ఎలర్జీ కారణంగా కూడా  ఇది వ్యాపిస్తుంది. అయితే,  గొంతుకి విశ్రాంతి, ఆవిరి పీల్చడం(స్టీమింగ్) లాంటివి చేస్తే ఒక వారంలో సమస్య తగ్గిపోతుంది. అలా కాకుండా, రెండు వారాలు దాటినా  గొంతు బొంగురు  తగ్గకపోతే  దాని గురించి శ్రద్ధ వహించాలి. వేసవిలో వచ్చే గొంతు సమస్యలకు ప్రధాన కారణం  పదే పదే చల్లనీళ్లు తాగడం. కూల్ డ్రింక్స్, ఐస్‌‌క్రీములు ఎక్కువగా తీసుకోవడం. దీని వల్ల గొంతులో గరగర, గొంతు నొప్పి, గొంతు బొంగురుపోవడం జరుగుతుంటుంది.  అయితే గొంతు సమస్యలు అక్కడే ఆగిపోకుండా కాస్త విస్తరించి, సైనసైటిస్‌‌, టాన్సిలైటిస్‌‌ సమస్యలతో పాటు, శ్వాసకోశాల ఇన్‌‌ఫెక్షన్లకు కూడా  దారి తీసే ప్రమాదం ఉంది.

గొంతు సమస్య ఎలాంటిదైనా విశ్రాంతి కీలకం.  ఇన్‌‌ఫెక్షన్ల వంటివాటితో మాట మారిపోతే చాలావరకు విశ్రాంతితోనే కుదురుకుంటుంది. కొద్దిరోజులు ఎక్కువగా మాట్లాడకుండా చూసుకుంటే చాలు. ఇక కొన్ని  ఇన్‌‌ఫెక్షన్లకి ఆవిరి పట్టటం మేలు చేస్తుంది. వేడి నీటిలో యూకలిప్టస్‌‌ నూనె వేసుకొని ఆవిరి పడితే మంచిది. రోజుకు కనీసం నాలుగు లీటర్ల  నీళ్లు తాగటం మంచిది. మాటిమాటికీ గొంతు తడుపుతూ ఉండాలి. ఫ్రిజ్‌‌లో ఉంచడం వల్ల బాగా చల్లబడిన, గడ్డకట్టిన ద్రవ పదార్థాలను తీసుకోవడం, తాగే నీళ్లల్లో ఐస్‌‌గడ్డలు వేసుకొని తాగటం అంత  మంచిది కాదు.

అప్పుడప్పుడు వేడి నీళ్లతో స్నానం, గోరువెచ్చని నీటిని తాగడం కూడా చేస్తుండాలి. కొంత మంది మాటిమాటికీ గొంతు  సవరించుకుంటారు. తరచూ గొంతు సవరించడం వల్ల  స్వరతంత్రులు ఒకదాంతో మరోటి రాసుకుపోయే ప్రమాదముంది. కాబట్టి ఆ అలవాటు మానుకోవాలి. గుసగుసలు పెట్టటం మంచిది కాదు. గుసగుసలు పెడితే స్వరతంత్రులు మరింత ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది.వేసవిలో సాధ్యమైనంతవరకు మద్యం, కాఫీ, టీలు తాగకపోవటం మేలు. పొగతాగే అలవాటుంటే వెంటనే  దాన్ని మానెయ్యాలి. పొగ, దుమ్ము, ధూళితో కూడిన వాతావరణాలు గొంతు ఇన్ఫెక్షన్లను త్వరగా వ్యాపింపజేస్తాయి.

Exit mobile version