Site icon 123Nellore

వివేకాను చంపినట్లు ఒప్పుకుంటే రూ.10 కోట్లు ఇస్తామన్నారు.

వివేకా హత్యకేసు రోజుమలుపు తిరుగుతోంది. చివరకు అన్ని వేళ్లూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. గతేడాది సీబీఐకి పలువురు అనుమానితులు ఇచ్చిన వాంగ్మూలంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దస్తగిరి, పనిమనిషి లక్ష్మీ, వైఎస్.ప్రతాప్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, రంగయ్య, సీఐ శంకరయ్య వంటి వాళ్లు ఇచ్చిన వాంగ్మూలంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయంపై స్పష్టంగా వివరిస్తున్నారు. అంతేకాదు కాదు తాజాగా బయటకు వచ్చిన మరో ఇద్దరి వాంగ్మూలాల్లోనూ వారిద్దరి పేర్లనే ప్రస్తావించారు. వివేకానందరెడ్డిని రాజకీయ కారణాలతోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి హత్య చేయించారని పులివెందుల వాసి నాగప్ప సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

అయితే ఇందులో మరో సంచలనాత్మక విషయం బయటకు వచ్చింది. హత్య నువ్వు చేసినట్లు ఒప్పుకుంటే రూ.10 కోట్లు ఇస్తామని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఆఫర్ చేసినట్లు కల్లూరు గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. నీ జీవితం సెటిల్ చేస్తాం, వివేకా హత్య నేరం నీపై వేసుకో, పోలీసులు సంగతి నేను చూసుకుంటా అంటూ తనను ప్రలోభపెట్టారని గంగాధర్ రెడ్డి తెలిపారు. వివేకా ఇంటికి దొంగతనానికి వెళ్లినప్పుడు డబ్బుకోసం బీరువా పగలగొడుతుండగా వివేకా నిద్రనుండి లేచారని, చూస్తే దొరికిపోతామన్న కారణంతో చంపామని నేరాన్ని నీపై వేసుకోవాలని శివశంకర్ రెడ్డి తనకు చెప్పాడని గంగాధర్ రెడ్డి వివరించారు.

ఇదిలా ఉండగా ఈ హత్యకేసులో వరుసగా బయటకు వస్తున్న వాంగ్మూలాలతో వైసీపీని కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. స్పందించడానికి కూడా ముందుకు రావడం లేదు. అవినాష్ రెడ్డిని లోక్ సభ స్పీకర్ అనుమతి తీసుకుని జగన్ సస్పెండ్ చేయాలని ఓవైపు ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. జగన్ ను కూడా సీబీఐ విచారణ చేయాలని కోరుతున్నారు. విచారణలో వేగం పెంచిన సీబీఐ త్వరలోనే వివేకా హత్య  కేసును అంతిమ దశకు చేరుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version