కొత్త జిల్లాల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైలురాయి అని సమాచార శాఖా మంత్రి పేర్ని నాని అన్నారు. నూతన అధ్యాయానికి సీఎం జగన్ నాంది పలికారని అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చేశామని అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు అనుభవం ఏమైందని చెప్పుకున్నారు. చంద్రబాబు దున్నపోతు ఈనింది అని చెబితే పవన్ కట్టేసే రకమని ఎద్దేవా చేశారు. బాబు ఉన్నప్పుడు పవన్ చాలా బాధ్యతలు తీసుకున్నారు కదా అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు.
అమరావతి రైతుల భూములు లాక్కుంటే బాబుని ఒక్క అడుగు కూడా కదలనివ్వనన్నాడని, దివిస్ ల్యాబ్ వద్దకు వెళ్లి మాటలు చెప్పారు.. వారికి ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. ఉద్దానం బాధ్యత తీసుకున్నాను అన్నారు కదా.. వారికి ఏం చేశారని, చంద్రబాబు ఆఫీస్ నుంచి వచ్చిన దానిపై సంతకం చేయడం తప్ప ఏం చేశావ్ అని పవన్ ను ప్రశ్నించారు. పవన్ పల్లకి మోసిన టీడీపీ ప్రభుత్వం కాదు.. ప్రజల ఆకాంక్షలతో నడుస్తున్న ప్రభుత్వం.. మీతో చెప్పించుకునే ప్రభుత్వం కాదిదని హితవు పలికారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న, తెస్తామన్న వారిపై అఖిలపక్షం వేయమని అడిగారా? అని ప్రశ్నించారు.
ప్యాకేజీ ముద్దు అన్నప్పుడు అఖిలపక్షం కావాలని అడిగారా? అని నిలదీశారు. అప్పుడేమో నోరు కట్టేసుకుని చంద్రబాబుకు అవసరమైనప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రామకృష్ణ, నారాయణ ఎర్రజెండాను ఏ స్థితికి తీసుకెళ్లారని ప్రశ్నించారు. 30 లక్షల మందికి ఇళ్లు ఇస్తే చప్పట్లు కొట్టాల్సిన కమ్యూనిస్టుల నోర్లు పడిపోయాయని మండిపడ్డారు. కమ్యూనిస్ట్ పార్టీపై వారికి గౌరవం ఉంటే ఆ పార్టీ వీడి సీపీఐ చంద్రబాబును అంటిపెట్టుకోవాలన్నారు. చంద్రబాబు, ఆయన కొడుకు కోసం గొప్ప కమ్యూనిస్ట్ పార్టీని వాడుకోవద్దన్నారు. మానవత్వం మాత్రమే వైఎస్ జగన్ కులం అని స్పష్టం చేశారు.