వాలంటీర్ తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారని, లబ్ధిదారుడిని వాలంటీర్లు ఎంపిక చేయడమేంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అర్హులకు రాజకీయకక్షతో వైఎస్సార్ చేయూత పథకం నిలిపివేయడంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. గుంటూరు జిల్లా గార్లపాడుకు చెందిన 26 మంది గ్రామస్తులు తమకు చేయూత రావడం లేదని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా వాలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రామస్తుల తరపున న్యాయవాది అరుణ్ శౌరి వాదనలు వాదించారు.
ఈ సందర్భంగా ఏడుగురు వాలంటీర్లకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వాలంటీర్ల సర్వీస్ నిబంధనలు ఏమిటని ప్రశ్నించింది. వాలంటీర్ అంటే స్వచ్ఛందం కాదా?.. డబ్బులెలా ఇస్తారు? అని పేర్కొంది. పెన్షన్‍దారుల వాలంటీర్ పరారీ, శ్రీకాకుళంలో ఘటనలపై పత్రిక వార్తలను హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రస్తావించారు.దీనిపై ప్రభుత్వం వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అదేశాలు జారీ చేసింది. పిటిషన్ వేసిని 26 మందికి చేయూత పథకం మంజూరు చేయాలని ఆదేశించింది.
అయితే ఇటీవల వాలంటీర్ల ప్రవర్తన ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెడుతోంది. పలు చోట్ల మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటం, పెన్షన్ సొమ్ము తీసుకెళ్లడం వంటివి ప్రభుత్వానికి చెడ్బపేరును మిగిలిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఇంటింటికీ సేవలందించాలన్న సంకల్పాన్ని వాలంటీర్లు నీరు గార్చుతున్నారని విమర్శ వ్యక్తమవుతోంది. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వాలంటీర్లకు తీవ్రమైన హెచ్చరికలు చేశారు. పనితీరు మార్చుకోకపోతే పీకేస్తామని కూడా బెదిరించిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ప్రభుత్వం హైకోర్టులో ఏం కౌంటర్ వేస్తుందో చూడాల్సి ఉంది.