Site icon 123Nellore

ఆస్కార్‌ వేడుకల్లో హోస్ట్‌ చెంప పగలకొట్టిన స్టార్‌ హీరో

ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అకాడమీ అవార్డుల(ఆస్కార్‌) ప్రదానోత్సవంలో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఆనందం, భావోద్వేగాల మధ్య సాగే ఈ వేడుకల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ అందరినీ విస్మయానికి గురి చేసింది. తొలుత అందరూ ‘షో’లో భాగంగానే ఆటపట్టించడానికి జరుగుతున్న ఘటన అని భావించినప్పటికీ.. తర్వాత అసలు విషయం తెలుసుకొని కంగుతిన్నారు.

అసలేమైందంటే.. ఆస్కార్‌ వేడుకలకి ప్రముఖ కమెడియన్ క్రిస్‌ రాక్‌ హోస్ట్‌గా వ్యవహరించాడు. హాలీవుడ్‌ హీరో విల్‌స్మిత్‌ ఈ వేడుకలకు హాజరయ్యాడు. హోస్ట్‌గా వ్యవహరిస్తున్నక్రిస్‌.. ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు ప్రకటించడానికి ముందు వీక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తేందుకు ఓ కామెడీ ట్రాక్‌ను చెప్పుకొచ్చారు. అందులో విల్‌స్మిత్‌ భార్య జాడా పింకెట్‌ ప్రస్తావనను తీసుకొచ్చారు. జుట్టు పూర్తిగా తొలగించుకొని వేడుకకు హాజరైన ఆమెను ‘జీ.ఐ.జేన్‌’ చిత్రంలో ‘డెమి మూర్‌’ ప్రదర్శించిన పాత్రతో పోల్చారు. ఈ చిత్రంలో ఆమె పూర్తిగా గుండుతో కనిపించడం గమనార్హం. జీ.ఐ.జేన్‌ సీక్వెల్‌లో కనిపించబోతున్నారా? అంటూ హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశారు. పింకెట్‌ ‘అలోపేసియా’ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో జుట్టు ఊడిపోతుంటుంది. ఈ విషయాన్ని ఇటీవల ఆమె బహిరంగంగా తెలిపారు కూడా.

పింకెట్ పై జోకులు పేల్చాడంతో మెుదట కామెడీగా తీసుకున్న స్మిత్ తర్వాత కోపంతో స్టేజి పైకి వచ్చి క్రిస్‌రాక్‌ చెంపపై కొట్టాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే విల్ స్మిత్ కొట్టిన ఈ చెంపదెబ్బని క్రిస్‌రాక్‌ చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నాడు.. స్మిత్‌ మాత్రం ఆగ్రహంతో ఊగిపోతూ.. నా భార్య పేరు నీ నోటి నుంచి రానివ్వకు అంటూ గట్టిగా అరిచాడు. విల్ స్మిత్ ప్రవర్తన చూసి అక్కడున్నవారు షాకయ్యారు. అయితే మరోవైపు క్రిస్‌రాక్‌ పోలీసులను ఆశ్రయిస్తాడని అంతా అనుకున్నారు. కాని కంప్లైంట్‌ ఇవ్వడానికి క్రిస్‌ రాక్‌ నిరాకరించినట్లు LA పోలీసులు ప్రకటించారు. ఆ ఘటన జరిగిన 40 నిమిషాల తర్వాత ‘ఉత్తమ నటుడి’గా అవార్డు అందుకునేందుకు విల్‌ స్మిత్‌ వేదికపైకి వచ్చారు. జరిగిన ఉదంతంపై స్పందిస్తూ అకాడమీ, సహచర నామినీలకు క్షమాపణలు చెప్పారు. అయితే, క్రిస్‌ పేరు మాత్రం ప్రస్తావించలేదు. అవార్డు అందుకుంటున్న సమయంలో స్మిత్‌ కన్నీటిపర్యంతం కావడం గమనార్హం. కింగ్‌ రిచర్డ్‌ సినిమాలో టెన్నిస్‌ స్టార్స్‌ వీనస్‌, సెరెనా విలియమ్స్‌ తండ్రి రిచర్డ్‌ విలియమ్స్‌ పాత్రలో స్మిత్‌ కనిపించారు.

ఇక అమెరికన్‌ నటుడు అయిన విల్‌ స్మిత్‌.. మెన్‌ ఇన్‌ బ్లాక్‌, ది పర్సూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌, హ్యాంకాక్‌, ఐ యామ్‌ లెజెండ్‌ లాంటి సినిమాలతో విల్‌ స్మిత్‌ ఇండియన్‌ ఆడియొన్స్‌కు సుపరిచితుడే. ఇప్పటిదాకా ‘అలీ’, ‘ది పర్సూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’, ‘కింగ్‌ రిచర్డ్‌’కు గానూ మూడుసార్లు ఉత్తర నటుడి కేటగిరీలో నామినేట్‌ అయ్యారు ఆయన. అయితే ది ఫ్రెష్‌ ప్రిన్స్‌గా పేరున్న విల్‌ స్మిత్‌కు ఆస్కార్‌ 2022లో అవార్డు ముచ్చట తీరింది. కింగ్‌ రిచర్డ్‌లో వీనస్‌, సెరీనా విలియమ్స్‌ తండ్రి పాతర రిచర్డ్‌ విలియమ్స్‌ రోల్‌లో ఆయన కనబర్చిన అద్భుతమైన నటనకు ఆస్కార్‌ దక్కించుకున్నాడు.

Exit mobile version