ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రాష్ట్రంలోని డ్రగ్స్ విభాగం అధికారులందరితో కలిసి గురువారం మంత్రి సెక్రటేరియట్ లో విస్తృతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. డ్రగ్స్ విభాగం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలను ఆమె ఈ సందర్భంగా సిబ్బందికి వివరించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మందుల ఊసే తలెత్తకూడదన్నారు. అన్ని మందుల షాపులను నిరంతరం తనిఖీలు చేస్తూనే ఉండాలని చెప్పారు. నకిలీ మందుల తయారీ, అమ్మకం… లాంటి చట్ట వ్యతిరేక చర్యలు ఎక్కడ జరుగుతున్నా పసిగట్టేలా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు పనిచేయాలని చెప్పారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాలం తీరిన మందులు ఎక్కడా కనిపించరాదని చెప్పారు. ప్రతి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ప్రతి నెలా కనీసం 50కిపైగా మెడికల్ షాపులను తనికీ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు. నిబంధనలు పాటించని వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ బ్యాంకులపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయని, అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. రక్తదాన శిబిరాలు నిర్వహించని బ్లడ్ బ్యాంకులను గుర్తించాలన్నారు. రక్తనిల్వలు, ప్లేట్ లెట్స్ లాంటి వాటిని ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే మాత్రమే అమ్మేలా చూడాలని చెప్పారు.
అధిక ధరలకు కొంతమంది రక్తపు నిల్వలు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి బ్లడ్ బ్యాంకులో ధరల పట్టిక ఉండేలా చూడాలని ఆదేశించారు. అన్ని బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్స్ విభాగం పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పారు. రక్త సేకరణ, నిల్వ కేంద్రాల్లో నర్సుల స్థానంలో ల్యాబ్ టెక్నీషియన్లను వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, ఇలా జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. నిబంధనలు లేకుండా ఇష్టానుసారంగా క్లినికట్‌ట్రైల్స్ నిర్వహంచే వారిపై ఓ కన్నేసి ఉంచాలన్నారు.