Site icon 123Nellore

గురూ..ఫాస్ట్ ఫుడ్ తో జాగ్రత్త..!

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌.. ఏ గల్లీలో చూసినా ఇవే దర్శనమిస్తుంటాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పుట్టగొడుగుల్లా ఫాస్ట్‌పుడ్‌ సెంటర్లు పుట్టుకొచ్చాయి. ప్రతి ఏరియాలోనూ నాలుగైదు జంక్‌పుడ్‌ సెంటర్లు కనిపిస్తాయి. దీంతో యువత వీటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ పై స్కూల్‌ పిల్లలు, యువతీ, యువకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. బ్యాచిలర్స్‌ వీటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. యువ ఉద్యోగులు రాత్రివేళల్లోనూ పనిచేయాల్సి రావడంతో ఫాస్ట్‌ఫుడ్‌కు పట్టణాలలో బాగా ఆదరణ లభిస్తున్నది. ఇదే సంస్కృతి ఇప్పుడు పల్లెలలో కూడా వ్యాపించింది.

జంక్‌ పుడ్‌ పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇవి తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసి కూడా యువత జంక్‌పుడ్‌పై మోజు చూపుతుంది.  ఫాస్ట్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడితే డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. అయితే, ఫాస్ట్‌ఫుడ్ భావోద్వేగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని చెబుతున్నారు బర్మింగామ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అలబామాకు చెందిన పరిశోధకులు.

కొంతమంది పాఠశాల విద్యార్థుల ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఫాస్ట్‌ఫుడ్ వల్ల వ్యాకులతకు లోనవుతారని నిర్ధారించారు. వ్యాకులత గురయ్యే వారిలో ఎక్కువమంది పాఠశాల వయసువారే ఉంటున్నారు. 12 నుంచి 17 ఏళ్ల  పిల్లలలో ఎక్కువ మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారని జాతీయ డేటా విశ్లేషణలో తేలింది. ఇక యువకుల్లో ఇది 63 శాతంగా ఉంది. డిప్రెషన్‌, మానసిక క్షోభకు గురికావడం, ఆత్మహత్య ఆలోచనలు రావడం యువకుల్లో ఎక్కువగా పెరుగుతోంది.

Exit mobile version