భారతీ సిమెంట్ రేటుపై లేని ధరల నియంత్రణ పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లా నాయక్ పై ఎందుకు విధిస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భీమ్లానాయక్ సినిమా విషయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని అన్నారు. నేడు విడుదల అయిన ‘భీమ్లానాయక్’ సినిమాపై ట్వీట్టర్ లో చంద్రబాబు స్పందించారు.
ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను రాష్ట్రంలో జగన్ వేధిస్తున్నారని తెలిపారు. తన మూర్ఖపు వైఖరి వీడాలని హితవుపలికారు. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి.. థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ జగన్ వదలడం లేదన్నారు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తులను టార్గెట్‌గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆయా ప్రాంతాల వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలన్నీ ప్రయత్నిస్తుంటే.. జగన్ రెడ్డి మాత్రం సినిమాలపై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారని యెద్దేవా చేశారు. తప్పును ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నించి.. నిలదీస్తుందని స్పష్టం చేశారు. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇదే వ్యవహారంపై నారా లోకేష్ సైతం స్పందించారు. “భీమ్లా నాయక్” సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని, వీలైనంత త్వరగా “భీమ్లా నాయక్”ను చూసేందుకు ఎదురుచూస్తున్నాని వివరించారు. రాష్ట్రాన్ని అడుక్కునే స్థాయికి జగన్ దిగజారుస్తున్నారని మండిపడ్డారు.