Site icon 123Nellore

తేలని గన్నవరం పంచాయతీ..!

గన్నవరం వైసీపీలో విబేధాలు తారా స్థాయికి చేరాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రారావు మధ్య వార్ నడుస్తోంది. వీరిద్దరి మధ్యనున్న విబేధాలు తొలగించి ఒక గాటిలో పెట్టాలనుకున్న వైసీపీ అధిష్టానానికి ఇది పెద్ద సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు గురువారం సీఎంఓ కార్యాలయం కబురు పంపింది. వీరితో వైసీపీ పెద్దలు చాలా సేపు చర్చలు జరిపారు. చర్చలు కొలిక్కి రాకపోవడంతో మరోసారి రావాలని ఇరువురినీ ఆదేశించారు. అయితే వైసీపీ నేత శ్రీభరత్ రెడ్డి వల్లభనేని వంశీపై తీవ్రమైన విమర్శలు చేశారు.  వల్లభనేని వంశీతో కలిసి ప్రయాణం చేయలేమని ఖరాకండిగా చెప్పారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‍పై.. వంశీ నోటికొచ్చినట్టు మాట్లాడారని, ఆస్తులు కాపాడుకునేందుకే వైసీపీలో వంశీ చేరారు ధ్వజమెత్తారు. వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా.. కార్యకర్తలను వంశీ ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. ఇదే వ్యవహారంపై దుట్టా రామచంద్రారావు స్పందిస్తూ.. తాము పదవులు ఆశించి వైసీపీలో చేరలేదని, వంశీ చేరిన తర్వాత నియోజకవర్గంలో పరిస్థితి మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  సీనియర్ నేతలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

టీడీపీ నుంచి తనతో వచ్చినవారికి ప్రాధాన్యత వంశీ ప్రాధాన్యం ఇచ్చారని, అవమానాలు భరించాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పారు. సీఎంవోలో స్పష్టంగా చెప్పామని, మరోసారి పిలిచి చర్చిస్తామని చెప్పారని దుట్టా రామచంద్రారావు తెలిపారు. అయితే ఇది అంత తేలిగ్గా తేలే వ్యవహారం కాదని విశ్లేషకులు చెప్తున్నారు. విడవమంటే పాముకు కోపం..కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా ఇంఛార్జ్ గా వంశీకి ఇస్తే దుట్టా వర్గానికి కోపం, దుట్టాకు ఇస్తే వంశీకి అవమానం చేసినట్లు అవుతుందని వైసీపీ నేతలు చేతులు పిసుక్కుంటున్నారు. ఈ సారి జరపబోయే చర్చలైనా ఓ కొలిక్కి వస్తాయో లేదో చూడాలి.

Exit mobile version