Site icon 123Nellore

శాంతిభద్రతల్లో వైఫల్యం చెందారు : చంద్రబాబు

మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరగడం బాధాకరమని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలపై చంద్రబాబు శనివారం లేఖ రాశారు. మహిళలపై హింస, అత్యాచారాలు పెరిగేందుకు ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని ఆక్షేపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని, విజయవాడ ఆస్పత్రిలో అత్యాచారమే దీనికి సాక్ష్యమని తెలిపారు. కూతురు కనిపించడం లేదని స్వయంగా తల్లిదండ్రులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితురాలిని మేము పరామర్శించాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందని పేర్కొన్నారు.  అత్యాచారం ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో కూడా హోంమంత్రికి తెలియకపోవడం బాధ్యతారాహిత్యమేనని తెలిపారు. జాతీయ క్రైమ్ బ్యూరో నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో మూడోవంతు ఏపీలోనే జరగడం అవమానకరం- మహిళలపై భౌతిక దాడులు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపులలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉండటం గర్హనీయం అని తెలిపారు. దిశ చట్టం ప్రకారం నిందితులకు 21 రోజుల్లో శిక్ష వేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

రాష్ట్రంలో దిశ చట్టం అమల్లో ఉందా? అని నిలదీశారు. ఎన్ని కేసులను నమోదు చేశారు, ఎంతమందికి శిక్ష వేశారన్నారు. డ్రగ్స్, గంజాయి, మద్యం వల్ల నేరాలు పెరిగాయని, అత్యాచారానికి గురైన బాధిత యువతి కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం, ఇల్లు, జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసాంఘిక శక్తులు పెచ్చుమీరిపోతున్నాయి. గంజాయి, డ్రగ్స్‌ , మద్యం వంటి మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగించడం వల్లే ఇలాంటి నేరాలు నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు.

Exit mobile version