రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, సంస్థలు, సొసైటీలు తీసుకున్న ఆఫ్ బడ్జెట్ అప్పులపై వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని.. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం కోరింది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని.. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం ఈ నెల చివరి నాటికి వివరాలు సమర్పించాలని కోరింది. ప్రభుత్వ హామీతో.. పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీలు తీసుకున్న రుణాలకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని కోరుతూ లేఖ రాసింది. ప్రభుత్వ హామీతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.. బహిరంగ మార్కెట్ నుంచి కార్పొరేషన్లు, సొసైటీ రుణాలు తీసుకున్నాయని.. ఆయా సంస్థల పేరు, ఏ ఆర్థిక సంస్థ నుంచి రుణం ఎంతమేర తీసుకున్నారో తెలపాలని పీఏజీ కార్యాలయం కోరింది.
ప్రభుత్వ పథకాల అమలు కోసం బడ్జెట్‌లో నమోదు కాని ఈ రుణాలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని లేఖలో పేర్కొంది. ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు తీసుకున్న రుణాలు.. రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే మారుతున్నాయని పీఏజీ కార్యాలయం స్పష్టం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి.. వార్షిక ఖాతాలకు సంబంధించి ఆడిట్ నిర్వహించాల్సి ఉన్నందున.. మే 31లోగా వివరాలు ఇవ్వాల్సిందిగా.. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం కోరింది.
అయితే విచ్చలవిడిగా అప్పులు చేస్తూ ఏపీని దివాళా తీయిస్తున్నారని ప్రతిపక్షం ఓ వైపు తీవ్ర విమర్శలు చేస్తోంది. మరో వైపు అతిగా చేస్తున్న అప్పులను అరికట్టాలని ఇప్పటికే పలువురు లేఖలు కూడా రాశారు. అయితే ఇది వరకే అప్పుల వివరాలు పంపాలని కేంద్రం కోరినా రాష్ట్రం పంపలేదు. తమిళనాడులో సంక్షోభం చోటు చేసుకున్న సందర్భంలో భారత్ లోనూ కొన్ని రాష్ట్రాల ఆర్థిక తీరు ఆందోళనకు గురి చేస్తోంది.