రాష్ట్రంలో విద్యా రంగాన్ని నాశనం చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు, చర్యలున్నాయని మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ అన్నారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. 3, 4, 5 తరగతులను హైస్కూల్లో పెట్టాలనడం, ప్రాథమిక పాఠశాలల తగ్గింపునకు పూనుకోవడం, 9వ తరగతి నుంచీ సీబీఎస్ సిలబస్ అమల్లోకి తేవాలని చూసే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇంకా ఏమన్నారంటే..‘‘తరతరాలకు సంబంధించిన విద్యా సముపార్జనను జగన్ తన తుగ్లక్ నిర్ణయాలతో నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు.
నూతనవిద్యావిధానం పేరుతో 2010లో వచ్చిన కస్తూరి రంగన్ నివేదిక ఆధారంగా, జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను పాఠశాలలకు, పాఠశాలల్ని గ్రామాలకు దూరంచేసే ఎత్తుగడకు తెరలేపాడు. గత ప్రభుత్వంలో ప్రతిఏటా డీఎస్సీలు నిర్వహించి, సమాజాభివృద్ధికి విద్యారంగాన్ని పరిపుష్టంచేయాలన్న సంకల్పంతో చంద్రబాబునాయుడు పనిచేశారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు నూతన విద్యావిధానంపేరుతో, ఆంగ్లమాధ్యమంపేరుతో పూర్తిగా విద్యావ్యవస్థ నిర్వీర్యానికే సిద్ధమయ్యాడనిపిస్తోంది. కొఠారి కమిషన్ లోని అంశాల ప్రకారం ప్రతితరగతికి ఒకగది, ప్రతి తరగతి కి ఒక ఉపాధ్యాయుడు అనే నిబంధనతో పాటు, ప్రతిసబ్జెక్ట్ కు ఒక నిష్ణాతుడైన ఉపాధ్యాయుడు ఉండాలనే నిబంధనలు విద్యారంగానికి కీలకంగా మారాయి. ఈ నిబంధనలను గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పాఠశాలలనేవి లేకుండా చేయాలనే దురుద్దేశంతో ముందుకెళ్తున్నారు. కేంద్రప్రభుత్వం భేటీ బచావో-భేటీ పడావో నినాదం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో భేటీలకు రక్షణ లేకుండా చేశారు. బాలికలకు విద్యను కూడా దూరం చేసేందుకు సిద్ధమయ్యాడు.
ప్రతి మండలానికి ఒక ఇంటర్ కాలేజీ పెడతామంటున్న ఈ ప్రభుత్వం, ముందు ప్రాథమిక విద్యా భాస్యాన్ని విద్యార్థులకు ఎందుకు దూరం చేస్తోందో సమాధానం చెప్పాలి? కొత్త విద్యా విధానాలతో తనకు వ్యతిరేకంగా గళమెత్తిన ఉపాధ్యాయులపై కక్ష తీర్చుకోవాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. టీడీపీ పోరాడుతోందని ఆలోచించకుండా పార్టీలకు అతీతంగా ప్రజలంతా కలిసిరావాలని విజ్ఞప్తిచేస్తున్నాం. విద్యార్థులు చదువుకోవాలంటే అన్నిఊళ్లలో పాఠశాలలు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ చర్యలు, నిర్ణయాలతో ఇప్పటికే రాష్ట్రం అన్నివిధాలా వెనుకబడిందనే వాస్తవాన్ని గుర్తించాలి. గ్రామాల్లోని బడులను ఏర్పాటు చేయడం ద్వారా విద్యను కాపాడుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకుసాగుదాం’’అని పేర్కొన్నారు.