ఈలలు, తాళాలు మంగళసూత్రాలతో చట్టసభల్లో వెకిలి చేష్టలేంటని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. బుర్ర లేని లోకేష్.. మగవాళ్ళకు కూడా మంగళసూత్రాలు కడతాడేమోనని అంతా భయపడ్డారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ వైఖరి జుగుప్సాకరంగా ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడంలో తండ్రిది ఒక విధానం.. కొడుకుది ఒక విధానం.. పార్టీది ఒక విధానమా? అని ప్రశ్నించారు. సారాపై నానా యాగీ చేసి, ఎక్సైజ్ పాలసీపై చర్చ జరిగితే.. టీడీపీ ఎందుకు పారిపోయిందన్నారు.
‘‘తెలుగుదేశం పార్టీ తీరు అప్రజాస్వామ్యకంగా ఉంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి అకారణంగా ఏదోకటి సృష్టించుకుని శాసన సభకు రానని భీష్మ ప్రతీజ్ఞ చేశారు. ఆయన శపథం చేసి సభకు రావడంలేదు. వాళ్ల అబ్బాయ్ లోకేష్ మాత్రం శాసన మండలికి వస్తాడు. మరోవైపు వాళ్ల పార్టీ సభ్యులు మాత్రం అన్ని సభలకు హాజరు అవుతారు. ఏమిటీ ద్వంద్వ వైఖరి?. ఏంటీ విధానం? ఏంటి మూడు విధానాలు? ఆ పార్టీ సభ్యులు వస్తారు, ఆయన కొడుకు వస్తాడు… చంద్రబాబు మాత్రం రాడు.ఏమిటీ రాజకీయం..? అసెంబ్లీకి వచ్చిన టీడీపీ సభ్యులు క్రియశీలకంగా సమావేశాల్లో పాల్గొంటారా అంటే అదీ చేయరు.
తొలిరోజే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని చివరికి మార్షల్స్‌ను ప్రయోగించాల్సిన అనివార్యమైన పరిస్థితిని స్పీకర్‌కు కల్పించారు. ఆ తర్వాత నుంచి వరుసగా రోజూ అసెంబ్లీలో ఏదో ఒక వింత కార్యక్రమం చేయడం, సభ నుంచి సస్పెండ్ కావడం చేశారు. ఈ సెషన్ మొత్తం టీడీపీ వాళ్లకు ఉన్న ఒకే ఒక్క డైలాగ్ ఏంటంటే… “జంగారెడ్డిగూడెం నాటు సారా మరణాలు ప్రభుత్వ హత్యలే..” అనేది వాళ్ల బ్రాండింగ్. నాటు సారా లేదు, నాటు సారా వలన మరణాలు లేవు. సహజ మరణాలు అయితే ఉన్నాయి. శాసనసభ, మండలిలో టీడీపీ వ్యవహరించిన వైఖరి రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్య వాదులు సిగ్గుపడేలా ఉందని చెప్పడంలో ఏవిధమైన సందేహం లేదు’’ అని అన్నారు.