చంద్రబాబు కాలంలో వచ్చిన తెలుగు సంవత్సరాది పేర్లు దుర్ముఖి, వికారి అనే వికారమైన పేర్లతో తెలుగు సంవత్సరాదులు వచ్చాయని, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్లవ నామ సంవత్సరం, శుభకృత్ సంవత్సరం రావడం మంచి పరిణామం అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. జగన్‌గారి పరిపాలనలో గ్రామాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని, ఓవైపు ఆర్బీకేలు, మరోవైపు గ్రామ సచివాలయాలు, మరోపక్కన విలేజ్ క్లీనిక్‌లు, నాడు-నేడు ద్వారా పాఠశాలలు, ప్రభుత్వాసుపత్రులు చక్కగా ముస్తాబు అవుతున్నాయని అన్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ప్రతి అమ్మకి అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, చేయూత, కాపునేస్తం, మత్స్యకార, చేనేత నేస్తం, పెరిగిన పెన్షన్లు సరాసరి ఇంటికే వచ్చి చేరుతున్నాయన్నారు. స్వల్పంగా విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ప్రపంచం, దేశవ్యాప్తంగా అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయని, గత రెండేళ్ల నుంచి కరోనా వల్ల ఆదాయాలు పడిపోయాయని పేర్కొన్నారు. వాస్తవాలను పక్కనపెట్టి, చంద్రబాబునాయుడు అండ్ కో, ఎల్లో మీడియా ప్రజలకు అబద్ధాలు చెప్పే కార్యాక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.1400 కోట్లు మాత్రమే విద్యుత్ ఛార్జీల భారం వేయాల్సిన పరిస్థితులు వస్తే… రూ.42వేల కోట్లు ప్రజలపై భారం వేశారని ప్రజల్లోకి తప్పుడు ప్రచారాన్ని తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మన రాష్ట్రంలోనే చాలా తక్కువగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయని చాలా స్పష్టంగా అర్థం అవుతుందని, ఈ రాష్ట్రంలో 100 యూనిట్లను తీసుకుంటే… ఆ పరిధికి లోబడిన వారి సంఖ్య 70శాతం ఉంటుందన్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకుని చార్జీలు స్వల్పంగా మాత్రమే పెంచిన ప్రభుత్వం మాదని, దీన్ని గోరంతలు కొండంతలుగా చేసి, టీడీపీ, ఎల్లో మీడియా కలిసి ప్రజలను గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు. 10 రోజుల్లో తొమ్మిదిసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే పవన్ ఎందుకు మాట్లాడటం లేదుని, కేంద్రమంటే భయమా అని ప్రశ్నించారు.