Bhogi Festival: సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి పండుగ రోజున సాయంత్రం పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. భోగి పండ్లు సూర్యునికి ప్రీతికరమైన పండ్లు. భోగి పండ్లు పిల్లలకు పోస్తే ఆరోగ్యం కలుగుతుందని పెద్దలు విశ్వాసం. అయితే భోగి పండ్లు ఎందుకు పోస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భోగి పండుగ అంటే భోగభాగ్యాలు కలగజేసే పండుగ అని అర్థం. భోగి పండుగ శీతాకాలంలో వస్తుంది. శీతాకాలంలో చలి కారణంగా అనేక ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. ఈ ఇన్ఫెక్షన్ ల నుంచి కాపాడుకోవడానికి శరీరానికి కావల్సిన శక్తిని అందించడానికి భోగిపండ్లు సహాయపడతాయి.
భోగి పండుగ సూర్యుడి పండుగ. కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా భోగి పండ్లను అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు.
భోగి రోజున ఇంటి ముందర భోగిమంటలు వేసి చెడు కర్మలు తొలగిపోయి భోగభాగ్యాలు కలగాలని అగ్ని దేవుడిని ప్రార్థిస్తారు. ఈ భోగి మంటల నుండి దీపం తెచ్చి ఇంట్లో దేవుని ముందర పెడతారు. అలాగే ఈరోజు సాయంత్రం పిల్లల తలపై నుంచి భోగి పండ్లు పోస్తారు.
ఇలా భోగిపండ్లు పోస్తే బాల అరిష్టాలు, దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం.
భోగి పండ్లను శ్రీమన్నారాయణ స్వామి ప్రతిరూపంగా భావిస్తారు. కనుక పిల్లలకు తల మీద భోగిపండ్లు పోస్తే శ్రీమన్నారాయణ స్వామి ఆశీర్వాదం పిల్లలకు లభిస్తుందని నమ్ముతారు.
దీంతో పిల్లలకు ఉన్న దృష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల మానసిక రుగ్మతలు తొలగి పోయి వారి ఎదుగుదల బాగుంటుంది. శివుని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారని కథనం.
ఆ సమయంలో దేవతలు వారి తల మీద బదరీ ఫలాలన కురిపించారని చెబుతారు. ఆనాటి పురాణ కథనం ప్రకారం పిల్లలను నారాయణుడుగా భావించి భోగిపండ్లు పోసే సంప్రదాయం మన పెద్దలు పాటిస్తున్నారు.
భోగిపండ్లు సూర్య కిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. కనుక ఈ పండ్లను తలమీద పోవడంతో ఇందులోని విద్యుచ్ఛక్తి శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాన్ని అందిస్తుందని మన పెద్దలు నమ్ముతారు.
అందుకే పిల్లలకు భోగి రోజు భోగిపండ్లు పోసి ఆశీర్వదిస్తారు. 12 సంవత్సరాల లోపు చిన్న పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. భోగిపండ్లు బంతిపూల రెక్కలు, చిల్లర నాణ్యాలు చెరుకు గడ ముక్కలు కలిపి పిల్లల తలపై నుంచి పోసి వారిని ఆశీర్వదిస్తారు.
ఈ విధంగా చేస్తే తినకుండా బాల అరిష్టాలు తొలగిపోయి వారి ఎదుగుదల బాగుంటుంది అని నమ్ముతారు. ఇలా దిష్టి తీసిన భోగి పండ్లను తినకూడదు. వీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేస్తారు.