Site icon 123Nellore

రైతులను కులాల వారీగా విభజిస్తారా.? : పవన్ కళ్యాణ్

అప్పుల ఊబిలో ఉన్న రైతులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ అన్నారు.  రాష్ట్రంలో రోజూ అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సోమవారం వేర్వేరు చోట్ల రైతులు ఆత్మహత్య చేసుకోవడంపై పవన్ కళ్యాణ్ మంగళవారం స్పందించారు.  అప్పుల భారం భరించలేక ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం అని అన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రామకృష్ణ, వెంకటేశ్వర్ రెడ్డి, తిక్కయ్య కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకుండా వ్యవస్థలు పనిచేయాలని అన్నారు.

విధులు నిర్వర్తించడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు వైసీపీ రూ.50 వేలు పంట పెట్టుబడి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఎన్ని కుటుంబాలకు పంట పెట్టుబడి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతులను కూడా కులాలవారీగా విభజిస్తారా?  అని ప్రశ్నించారు.

జనసేన పార్టీ ఇప్పటికే కౌలు రైతు కుటుంబాలను ఆదుకుంటోందని తెలిపారు. కౌలు రైతుల కుటుంబాలకు జనసేన భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. రైతు ఉసురు తీసుకొనే పరిస్థితి రాకుండా వ్యవస్థలు పని చేయాలని పేర్కొన్నారు. గత మూడేళ్ల నుంచి రాష్ట్రంలో చోటు చేసుకున్న కౌలు రైతుల ఆత్మహత్యల ఘటనల్లో ప్రతి ఒక్కరికి రూ.7 లక్షల పరిహారం అందేలా పోరాడుతుందని భరోసా ఇచ్చారు. రైతుల నుండి కొనుగోలు చేసిన పంట డబ్బులు సకాలంలో చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

Exit mobile version