కాంగ్రెస్ పట్ల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ షాకింగ్ కామెంట్లు చేశారు. అది కూడా విమర్శలతో కాదు..సానుభూతిని తెలుపుతున్న రీతిలో ఆ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి శక్తివంతమైన కాంగ్రెస్ పార్టీ అవసరమని అన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ మరింత బలపడాలని, ఆ పార్టీకి చెందిన నాయకులు నిరాశతో పార్టీలు మారకూడదనేది తాను మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం అంటే ప్రతిపక్ష స్థానాన్ని ప్రాంతీయ పార్టీలు భర్తీ చేయడమేనని తెలిపారు. ప్రజాస్వామ్యం అనేది పాలకపక్షం, ప్రతిపక్షం అనే చక్రాల మీద నడిచే రథం లాంటిదని అన్నారు.
గతంలో వాజ్ పేయూ ఎన్నికల్లో ఓడిపోయినా, నెహ్రూ ఆయన గౌరవానికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా ప్రతిపక్షపాత్రను గుర్తించారని గుర్తు చేశారు. ఓటమి చూసి మనోధైర్యం కోల్పోవద్దని, ఇవాళ ఓటమి ఎదురైతే రేపు గెలుపు సిధ్దించవచ్చని పేర్కొన్నారు. ఒకప్పుడు బీజేపీకి పార్లమెంట్‌లో కేవలం 2 సీట్లు మాత్రమే ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ బలంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని,
కాంగ్రెస్ సిద్ధాంతాలను అనుసరించేవారు పార్టీలోనే ఉంటూ విశ్వాసాలకు కట్టుబడి ఉండాలన్నారు. కానీ గడ్కరీ వైఖరి తన పార్టీ అనధికారిక నినాదం కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదానికి విరుద్ధంగా ఉంది. బీజేపీ అగ్ర నాయకులు ఎన్నికల ర్యాలీలు, ఇతర వేదికలలో తరచుగా ఈ నినాదాన్ని ప్రస్తావిస్తుంటారు. అయితే గడ్కరీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం అవసరమంటున్న గడ్కరీ ఇదే మాటను మోడీకి చెప్పాలని సూచించింది. బీజేపీయేతర ప్రభుత్వాలను రాష్ట్రాల్లో దెబ్బకొట్టాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రేరేపిస్తున్నారని మండిపడింది.