వైఎస్ఆర్‌సీపీ వ్యవహరిస్తున్న ప్రజావ్యతిరేక తీరుపై ఫిర్యాదు చేసినా గవర్నర్ ఏనాడు స్పందించలేదని దాని వల్లే గవర్నర్ ప్రసంగం నుండి బయటకు వచ్చినట్లు టీడీఎల్పీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. వైసీపీ మూడు మూడేళ్ల పాలనలో రాజ్యాంగ వ్యవస్థలపై దాడి జరిగిందని అచ్చెన్నాయుడు వివరించారు. న్యాయ వ్యవస్థపై ఇష్టానుసారంగా వ్యవహరించినా ముఖ్యమంత్రిని పిలిచి ఖండించలేదని వివరించారు. గవర్నర్ పేరు మీద అప్పులు చేస్తే..తాము గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్ళామని, అయినా గవర్నర్ బిశ్వభూషణ్ స్పందించలేదన్నారు. ఎన్నికల కమిషన్‌పై దాడి చేసి.. రాత్రికి రాత్రే తొలగించారని, మండలిలో చైర్మన్ షరీఫ్‌పై దాడిచేసి బూతులు తిట్టారన్నారని గుర్తు చేశారు.
సీఆర్డీఏ చట్టం.. అసెంబ్లీలోనే తాము చేసిందేనన్నారు. ఈ చట్టాన్ని రద్దుచేస్తూ రాజ్యాంగ విరుద్ధమైన మూడు రాజధానులు బిల్లుపై గవర్నర్ సంతకం చేశారన్నారని తెలిపారు. పలుమార్లు తమ సభ్యులు గవర్నర్‌కు విన్నవించినా ఒక్కసారి కూడా స్పందించలేదని గుర్తు చేశారు. వీటన్నింటిపై ఆవేదనతోనే ఆలోచించి సభలో నిరసన తెలిపామని తెలిపారు. అయితే సభ ప్రారంభం తొలిరోజే టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఎవరూ ఊహించని విధంగా గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలి ప్రభుత్వంపై పోరుకు నడుం బిగించిందన్న సంకేతాన్ని పంపింది.
గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే టీడీపీ సభ్యులు.. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వెల్‌లోకి వచ్చి ప్రసంగ ప్రతులను చించేసి పోడియంపైకి విసిరేశారు. దీంతో దాదాపు 20 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగానికి తీవ్ర ఆటంకం కలిగింది. టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ వ్యూహమా..లేక ఇంకేదైనా ఉందన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ కార్యాలయంలో తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం జరిపారు. జరిగిన పరిణామాలపై చర్చించి దిశానిర్ధేశం చేశారు.