అమరావతిలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు అపూర్వ స్వాగతం లభించింది. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన తొలిసారిగా అమరావతికి వచ్చారు. మూడు రోజుల ఏపీ పర్యటన లో భాగంగా సీజేఐ ఎన్వీ రమణ నాగార్జున యూనవర్సిటీలో జరిగిన ఏపీ న్యాయాధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆయన అమరావతి బయల్దేరారు. నేలపాడులోని హైకోర్టులో బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో సీజేఐ కు సన్మానం జరిగింది.
ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ… న్యాయవాదులు సమాజానికి మార్గదర్శకులని, ప్రజల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. సమాజ శ్రేయస్సు కోసం న్యాయవాదులు తమ శక్తియుక్తులను ఉపయోగించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల కొరతను త్వరలోనే తీరుస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. హైకోర్టులో భారీగా కేసులు పెండింగ్ ఉన్నాయన్న సీజేఐ… త్వరలోనే కొత్త న్యాయమూర్తుల నియామకాన్ని పూర్తి చేస్తామన్నారు.
ఇందుకు సంబంధించి లిస్టు సిద్ధం చేయాల్సిందిగా.. హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు సూచించామని చెప్పారు. అంతకు ముందు.. నాగార్జున యూనివర్సిటీ నుంచి హైకోర్టుకు వెళ్లే దారిలో సీజేఐ ఎన్వీ రమణకు అమరావతి రైతులు అపూర్వ స్వాగతం పలికారు. జాతీయ జెండాలతో ఆయనపై పూల వర్షం కురిపిస్తూ.. ఆహ్వానం పలికారు. వారి ఆహ్వానానికి.. అభిమానానికి ప్రతిగా సీజేణ తన కారులోనే నిలబడి వారికి నమస్కారం చేస్తూ ముందుకు సాగారు. ప్రస్తుతం ఈ వార్త మీడియా లో వైరల్ గా మారింది.