వంకాయ చెట్లు మహా అయితే ఓ రెండు కేజీల కాయలు కాస్తాయి. అతికష్టం మీద ఓ ఐదు నుంచి పది కిలోల దిగుబడినిస్తాయి. కానీ ఆ వంగ తోటలోని మొక్కలు మాత్రం ఏకంగా క్వింటాల్ ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో మొక్క వంద కిలోల వంకాయలు కాస్తుంది. ఇదెక్కడో కాదు మనదేసంలోనే. అది కూడా ఓ యువ రైతు సాగు చేస్తున్నారు. సొంతూరిలో కూరగాయలు సాగు చేస్తూ.. తనదైన రీతిలో గుర్తింపు పొందుతున్నారు.
ఛత్తీస్ గఢ్ లోని సిల్ఫిలీ గ్రామానికి చెందిన దినేశ్ రాయ్ అనే యువకుడికి వ్యవసాయం అంటే మహా ఇష్టం. అందుకే ఎటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా హాయిగా… ఊళ్లోనే కూరగాయలు పండిస్తున్నారు. ఆధునిక కాలంలోని సాంకేతికత సాయంతో వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇజ్రాయెల్ టెక్నాలజీతో వంకాయలు పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంగ తోట ఏకంగా ఏడు నుంచి 8 అడుగల ఎత్తుదాకా పెరిగింది. ఎక్కడాలేని విధంగా ఎత్తుగా ఏపుగా పెరుగింది. పైగా ఒక్కో మొక్క వంద కిలోల వంకాయల దిగుబడిని ఇస్తోంది. 2016 నుంచి ఇదే తరహా సాగు చేయడం గమనార్హం.
వంగ తోట ఎత్తుగా పెరగడానికి కారణం ఉంది. హైబ్రిడ్ వంకాయ మొక్క కాండంలోకి అటవీ వంకాయ వేర్లను ప్రవేశ పెడతారు. వాటికి సరిపడ నీటిని డ్రిప్ పద్ధతిలో అందిస్తారు. అంతేకాకుండా ఎరువులు సమయానుసారం ఇస్తారు. అవసరమైతే క్రిమిసంహారక మందులను కూడా ఉపయోగిస్తారు. ఈ విధంగా సంరక్షిస్తూ.. వంగ తోటను తనదైన రీతిలో లాభాలు గడిస్తున్నాడు దినేశ్ రాయ్. వీటికి మంచి గిరాకీ కూడా ఉందని ఆయన అంటున్నారు.