తెదేపా అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబుపై పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు విమర్శలు గుప్పించారు. అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కావడం కోసం పిల్లనిచ్చిన మామ మరణానికి కారణయ్యాడని విమర్శించారు. అంతే కాదు, వైఎస్ఆర్ మరణంలోనూ చంద్రబాబు కుట్ర ఉందేమో అన్న సందేహాలూ ప్రజల్లో ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక.. ఆయన్ను కూడా చంపేందుకు బాబు కుట్ర చేస్తున్నట్లు ప్రజలు అనుకుంటున్నట్లు తెలిపారు.
వరద ప్రాంతాల్లో పరామర్శ సమయంలో.. నాతో పెట్టుకున్న వైఎస్ పరిస్థితి ఏమైందంటూ ఇటీవలే చంద్రబాబు వ్యాఖ్యానించడం ప్రజల్లో పలు అనుమానాలకు దారితీస్తోందని అన్నరు. 2014లో తనను నమ్మి జగన్ పాయకరావు పేట ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారని.. కానీ, పక్క నియోజకవర్గ నాయకుడికి చెద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఆశ చూపి.. తన ఓటమికి కుట్రపూనారని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి వల్లే దళితులకు న్యాయం జరిగందంటూ పేర్కొన్నారు. దళితులను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారని ధ్వజమెత్తారు.
ఐదేళ్ల పాటు మోదీ వెంట నడిచి.. ఆ తర్వాత మోదీని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వమని శపథం చేసి.. ఇప్పుడు అమిత్షా, మోదీ కాళ్లు పట్టుకోవడం ఏంటని మండిపడ్డారు. ప్రజలు భారీ ఓటమితో బుద్ది చెప్పినా సిగ్గు రాలేదని అన్నారు. జీఎంసీ బాలయోగి, ఎలిమినేటి మాధవరెడ్డి, ఎర్రన్నాయుడు వంటి నాయకుల మరణానికికూడా చంద్రబాబే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. తమ పార్టీలో కూడా ఎవరైనా ఎదుగుతుంటే.. వారిని చూసి చంద్రబాబు ఓర్వలేరని విమర్శించారు.