కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టడమే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అనుచిత ప్రవర్తనతో టీడీపీ సభ్యులు గవర్నర్‌ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తోడు ఎల్లో మీడియా తీవ్రమైన దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జగన్ అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు. నిత్యం అబద్ధాలను ప్రచారం చేయడమే ఎల్లో మీడియా పనిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 2.70 లక్షల మంది వాలంటీర్లు సేవలందిస్తున్నారని వివరించారు. 34 నెలల కాలంలో 6 లక్షల 3 వేలమందికి ఉద్యోగాలు కల్పించామని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడమే గత ప్రభుత్వానికి తెలిసిన పని అని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఆరోగ్యశ్రీని కూడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని, వైద్య రంగంపై కనీసం మాట్లాడే అర్హత కూడా చంద్రబాబు నాయుడుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాడు-నేడు ద్వారా రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను చంద్రబాబు మోసం చేస్తే.. తాము న్యాయం చేస్తున్నామని వివరించారు. రైతు భరోసాను ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్నాన్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక పథకం ఉందా అని, చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు పథకం గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు చంద్రబాబు ఏ రోజూ విలువ ఇవ్వలేదని విమర్శించారు.