చంద్రబాబు పర్యటనకు జనం స్పందన కరువైందని నీటిపారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించినా సిగ్గు లేదని మండిపడ్డారు. ఫ్రస్టేషన్‍లో చంద్రబాబు గందరగోళంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో చంద్రబాబుకు ఆదరణ ఉంటే ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. సీఎం జగన్‍ను ఎదుర్కోవడానికి కలిసి పోటీ చేయడానికి సిద్దమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి వైసీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందకూడదని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
విద్యుత్ టారీఫ్ ఏపీలో కన్నా కర్ణాటకలో ఎక్కువ అని, ఏపీ కన్నా కర్ణాటకలో ఎక్కువ విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఏపీ కన్నా మహారాష్ట్రలో ఆర్టీసీ చార్జీలు ఎక్కువన్నారు. కావాలనే చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? లేక సన్నాసి రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. పోలవరాన్ని పూర్తి చేయలేదు కాబట్టే చంద్రబాబును ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని దుయ్యబట్టారు. కుప్పంలో జరిగిన ఎన్నికల్లో మండలాలు, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిందన్నారు.
అమ్మఒడి – నాన్న బుడ్డి అని ప్రాసలతో సంక్షేమ పథకాలను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పథకాల్లో ఏపీ నంబర్ వన్ గా ఉందన్నారు. ఐటీ ఉద్యోగాలు ఇచ్చానన్నచంద్రబాబు ఎంత మందికి ఇచ్చారో సమాధానం చెపాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సేవ చేసే చక్కటి వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు విమర్శించడం దుర్మార్గమన్నారు. సీఎంగా సభకు వస్తానన్న చంద్రబాబు శపథం ఎప్పటికీ నెరవేరదన్నారు. దశదిశ లేని జనసేన ప్యాకేజీ కోసం మళ్లీ సిద్దమైందని ఆరోపించారు.