చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అడ్డగోలుగా నోటికొచ్చినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కిందిస్థాయి అధికారుల తప్పులకు మొత్తం ప్రభుత్వాన్ని తప్పుపడతారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఉన్మాదం, బరితెగింపుతో మాట్లాడుతున్నారు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అపార తెలివి తేటలున్నాయని 40 ఏళ్లుగా నమ్మించే ప్రయత్నం చేసత్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు శక్తి సామర్థ్యాలు లేవా..? అని ప్రశ్నించారు. ఉంటే దుర్గమ్మ తల్లిని అవే ఎందుకు కోరుకున్నారు అని ప్రశ్నించారు.
చంద్రబాబుకు అంత అర్జెంటుగా తెలివితేటలు అవసరం లేదని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు రాకూడదని పేర్కొన్నారు. చంద్రబాబు ఇంకా రాజకీయాల్లో కొనసాగడం అవసరమా? అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నట్లుగా మాట్లాడుతున్నారని, ఇళ్లలోకి దూరి అమ్మాయిలను ఎత్తుకుపోతున్నట్లు చంద్రబాబు మాటలు చూస్తే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తేనా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఎన్టీఆర్ ను హేయమైన రీతిలో పదవి నుండి దించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు.
చంద్రబాబును జనం భరిస్తూ ఉండటం వల్లే లెక్కలేనితనం, బరితెగింపు పరిధిదాటి పోయాయని విమర్శించారు. 2014 నుండి 19 వరకు చంద్రబాబు చేసిన అరాచకాలను గుర్తు తెచ్చుకోవాలన్నారు. నవ నిర్మాణ, ధర్మపోరాట దీక్షల పేరుతో చంద్రబాబు చేసిన అరాచకం అంతా, ఇంతా కాదన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు చీత్కరించి, చెత్తబుట్టలో వేశారన్నారు. దేశంలో ఎన్నడూ లేనంతగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధిక రాజకీయ ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు.