విజయనగరం రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బోడికొండపై రామాలయ పునర్నిర్మాణ శంకుస్తాపన సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజు, మంత్రి వెల్లంపల్లి హాజరయ్యారు. అయితే, తనను కొబ్బరికాయ కూడా కొట్టకుండా వెల్లంపల్లి అడ్డుకున్నారని అశోక్ గజపతిరాజు కోప్పడ్డారు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుని పరిస్థితి ఆందోళనకరంగా మారింది.. దీనిపై తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.. అశోక్ గజపతిరాజుపై మంత్రులు ఓ వీధి రౌడీల్లా మీద పడ్డారని.. ఉన్నత పదవుల్లో ఉండి ఇలాంటి పని చేయడానికి సిగ్గుండాలని అన్నారు. ఈ క్రమంలోనే మంత్రుల చర్యలను తీవ్రంగా ఖండించారు. రామతీర్థం శ్రీరాముడి సాక్షిగా వైసీపీ అరాచకం మరోసారి బయటపడిందని అన్నారు.
దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీని ప్రశ్నించినందుకు దాడులు చేయడమేంటని.. దీన్ని బట్టే వైకాపా ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోందని చంద్రబాబు అన్నారు. రామతీర్థం ఆలయ కమిటీ ధర్మకర్తగా బాధ్యతలు చేపట్టిన గజపతి పేరు లేకుండా ఎలా కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. వేల ఎకరాలు దానం చేసిన కుటుంబాన్ని ఇలా అవమాన పరచడం సరికాదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గజపతి రాజుపై కావాలనే కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని మండిపడ్డారు.
గతంలో మన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా గజపతిని తొలగించి.. భూములు దోచుకోవాలని వైకాపా కుట్ర పన్నిందని ఆరోపించారు. రామతీర్థ దేవాలయానికి గజపతి రాజు విరాళం ఇస్తే ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నించారు.. భక్తిని కూడా అడ్డగించుకునే స్థాయికి వైకాపా పడిపోయిందా?.. అంటూ బాధపడ్డారు. కాగా, రామతీర్థంలో రాముడి తల తొలగించి సంవత్సరం పైన అవుతున్నా.. ఇప్పటికీ నిందుతులను పట్టుకోక పోగా.. సాయం చేసే వారిని కూడా ఇలా అవమానిస్తున్నారంటూ సీరియస్ అయ్యారు.