సినీ పరిశ్రమపై ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్ ట్వీట్లు చేస్తున్నారు పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు మండిపడ్డారు. ఈ మేరకు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. పవన్ అంటే విపరీతమైన ప్రేమ ఉన్నట్లు చంద్రబాబు, లోకేష్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ కోసం ఎంతో శ్రమించిన జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఏనాడూ చంద్రబాబు, లోకేశ్ ఆలోచించలేదని ఆరోపించారు.
సినీ పరిశ్రమ సమస్యలపై వేసిన కమిటీ, జీవో అంశంలో జాప్యం లేదని సీదిరి స్పష్టం చేశారు. సినిమా బాగుంటే ఆడుతుంది.. లేకపోతే ఆడదని అన్నారు. పవన్ కల్యాణ్ అయినా అకిరానందన్ అయినా ప్రభుత్వానికి ఒక్కటేని తెలిపారు. జీవో రాకముందే సినిమా రిలీజ్ చేసి, ఏం చేయలేదనడం సరికాదని హితవు పలికారు. సినిమా రిలీజ్ ను 4 రోజులు పాటు వాయిదా వేసుకుంటే షోలు, రేట్లు పాజిటివ్ గా వచ్చేవని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ కోసం ఏదో చేయాలంటే ప్రభుత్వానికి సాధ్యపడదన్నారు.
సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నాయి. చంద్రబాబుకు అందరూ ఒకటేనని, ప్రభుత్వం టికెట్ల నిర్ణయం తీసుకున్నాక కొన్ని సినిమాలు మాత్రమే విడుదల అయ్యాయని చెప్తున్నారు. పుష్ప, అఖండ ధైర్యంగా విడుదల చేసి విజయం సాధించాయంటున్నారు. సినీ ఇండస్ట్రీలోని అందరినీ చంద్రబాబు ఒకేలా చూస్తారని క్లారిటీ ఇచ్చారు. జూనియర్ అయినా, బాలయ్య అయినా తమ వాడేనని పోస్టు పెడుతున్నారు.