రాష్ట్రీయ జనతా దల్(ఆర్జేడీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు భారీ షాక్ తగిలింది. దాణా కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు దిమ్మతిరిగే తీర్పు ప్రకటించింది. పశువుల దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ ను రాంచీ కోర్టు దోషిగా తేల్చింది. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.60 లక్షల భారీ జరిమానాను విధించింది. ఈ కేసుకు సంబంధించి లాలూను గత వారమే కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు సోమవారం శిక్షను ఖరారు చేసింది.
1990 సంవత్సరంలో పశువుల దాణా కుంభకోణం చోటు చేసుకుంది. 25 ఏళ్ల విచారణ తరువాత దాణా స్కాంలోని ఐదో కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూను గత వారం దోషిగా తేల్చడం తెలిసిందే. డోరండ ట్రెజరీ నుంచి రూ.139.5 కోట్ల నిబంధనలకు విరుద్ధంగా విత్ డ్రా చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఈ కుంభకోణం సమయంలో బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ కొనసాగుతున్నారు. కేసు నమోదైనప్పుటి నుండి విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో బెయిల్ పై విడుదలైన లాలూ ప్రసాద్ ప్రస్తుతం బయట ఉన్నారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇటీవల కోర్టు విచారణకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాలూ హాజరయ్యారు. దాణా కుంభకోణానికి సంబంధించి మరో కేసు పాట్నాలోని సీబీఐ కోర్టులో పెండింగ్ లో ఉంది. భాగల్పూర్ ట్రెజరీ నుంచి అక్రమంగా గా నిధులను విత్ డ్రా చేశారంటూ ఈ కేసు నమోదయింది. దీంతో లాలూకు 5 ఏళ్లు జైలు శిక్ష ఖరారైంది. దీంతో బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. గతంలో లాలూ ఓ సందర్భంలో జైల్లోనైనా ఉంటాను కానీ, బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో లాలూకు శిక్ష ఖరారవడం చర్చనీయాంశంగా మారింది.