బాలీవుడ్ ముద్దుగుమ్మ ఈషా కొప్పికర్ క్యాస్టింగ్ కౌచ్, నెపోటిజం కారణంగా అవకాశాలు కోల్పోయానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఓ హీరోని ఒంటరిగా కలవనందుకు తనని ఏకంగా సినిమా నుంచే తొలగించేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పాకెట్ మనీ కోసం మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన ఇషా.. అనతి కాలంలోనే నటిగా బాలీవుడ్‌కి పరిచయమైంది. మొదటి చిత్రం ‘ఏక్ థా దిల్ ఏక్ థా ధడ్కన్’తో నటిగా అలరించిన ఆమె తెలుగులో ‘చంద్రలేఖ’, ‘ప్రేమతో రా’, ‘కేశవ’ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తున్నఇషా.. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది.
“కెరీర్ ఆరంభించిన కొత్తలో ఓ నిర్మాత నుంచి నాకు కాల్ వచ్చింది. ‘మేము చేస్తున్న సినిమాలో మిమ్మల్ని హీరోయిన్‌గా అనుకుంటున్నాం. మా హీరోకీ మీరు బాగా నచ్చేశారు. వీలుంటే ఒక్కసారి ఆయన్ని ఏకాంతంగా కలవండి’ అని ఆయన చెప్పాడు. నిర్మాత మాటలకు నాకు అర్థం తెలియలేదు. దాంతో ఆ హీరోకి కాల్ చేశా. ‘‘ఒంటరిగా మీరు ఒక్కరే నా వద్దకు రండి. మీ స్టాఫ్‌ని వెంటతీసుకుని రావొద్దు’’ అని హీరో చెప్పడంతో వాళ్ల ఉద్దేశం నాకు అర్థమైంది. ఆ మాటలకు బాధగా అనిపించింది. వెంటనే నిర్మాతకు ఫోన్ చేసి.. ‘‘నా టాలెంట్‌ని ఆధారంగా చేసుకుని ఆఫర్స్ వస్తే చేస్తా. అది చాలు నాకు’’ అని గట్టిగా చెప్పేశాను. ఆహీరోని కలవలేదనే ఒకే ఒక్క కారణంతో ఆ ప్రాజెక్ట్ నుంచి నన్ను తీసేశారు’’ అని ఇషా చెప్పుకొచ్చింది.
ఈ బ్యూటీ 2009లో టిమ్మీ నారంగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కూతురు పుట్టిన తరువాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది.