ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నేతలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హైలెట్ అవుతున్నారు. మహారాష్ట్ర మంత్రి, శివసేన నాయకుడు గులాబ్ రావ్ పాటిల్ తన నియోజకవర్గంలోని రోడ్లు బీజేపీ ఎంపీ హేమమాలినీ బుగ్గల్లా ఉన్నాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బీజేపీ, మహిళా సంఘాలు ఆగ్రహం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలి చకన్కర్ డిమాండ్ చేశారు.
కాగా ఆదివారం రాష్ట్రంలోని జల్గాన్ జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యలపై నటి ఎంపీ హేమమాలిని స్పందించారు. రహదారులను నటీమణుల బుగ్గలతె పోల్చే సంప్రదాయాన్ని గతంలో ఆర్జేడీ అధ్యక్షులు లాలూప్రసాద్ యాదవ్ మొదలుపెట్టారని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని అందరూ అనుసరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అయితే ఇలాంటి అనుచిత కామెంట్లు అంత మంచివి కావని హేమమాలిని అభిప్రాయపడ్డారు.
గౌరవ పదవులు, హోదాల్లో ఉన్నవాళ్లు, ప్రజా ప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు . కాగా ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గులాబ్‌రావు పాటిల్‌ను క్షమాపణ అడుగుతారా..? అని ఎంపీని అడగ్గా… అలాంటి వ్యాఖ్యలను తను పట్టించుకోనని ఆమె పేర్కొన్నారు. ఇటీవలే రాజస్థాన్ రాష్ట్ర మంత్రి రాజేంద్రసింగ్ తన నియోజకవర్గంలో రోడ్లు కత్రినాకైఫ్ బుగ్గల్లా ఉండాలంటూ వ్యాఖ్యానించారు. నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.