బీజేపీ నేతలకు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన హెచ్చరికలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఓ మసీదుకు స్థలం కేటాయింపుపై బీజేపీ కబ్జా అంటూ ప్రచారం చేస్తోందని చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో ముస్లిం సోదరులు తల్చుకుంటే అంటూ హెచ్చరించారు. బీజేపీలో ఉన్న కార్యకర్తలు బహు తక్కువమంది అని, వాళ్లు అతిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఓ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ద్వారంపూడి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. స్థలంపై బీజేపీ రాజకీయం చేస్తే తాము కూడా ఇంకో రకంగా రాజకీయం చేయాల్సి ఉంటుందని అన్నారు.
కోర్టులో ఉన్న వివాదంపై ఎమ్మెల్యే ద్వారంపూడి హెచ్చరికలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చర్చనీయాంశంగా మారాయి. ద్వారంపూడి వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ నేతలను హెచ్చరిస్తూ ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ అన్నారు. క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాకినాడలో జె.యన్.టి.యూకి చెందిన స్థలం కబ్జా కాకూడదనేది తమ అభిప్రాయమని స్పష్టం చేశారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ద్వారపూడి మాట్లాడారని అన్నారు. ‘‘ముద్దాయి సీఎంగా ఉంటే.. మీరంతా దొంగల ముఠాగా ఉన్నారు. మీదొక చిన్న ప్రాంతీయ పార్టీ.. మందు, పలావుతో నడిపే పార్టీ’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. ముస్లింలు తలచుకుంటే మీరెంత అని అనడం వెనక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ద్వారంపూడి వ్యాఖ్యలకు ముస్లిం పెద్దలే ఆశ్చర్యపోయారన్నారు.