బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉన్న ప్రేక్షకాధరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ప్రసారమవుతున్న అన్ని షోల కంటే బిగ్‌బాస్ షో ప్రత్యేకం.. ఇప్పటివరకు తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ షో.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాంపై సందడి చేస్తోంది. గత నెల 26న ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నో కామా.. నో ఫుల్ స్టాప్ 24 గంటల నిరంతర ప్రసారం అన్నారు. అలా చెప్పి నాలుగు రోజులు అయ్యిందో లేదో, అప్పుడే పెద్ద గ్యాప్ ఇచ్చారు. నాన్‌స్టాప్ లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది. 24/7 లైవ్ స్ట్రీమింగ్ అని చెప్పి దాన్నే ముందు నిలిపివేశారు బిగ్ బాస్ నిర్వాహకులు.
తొలిసారి ఓటీటీ వెర్షన్లో అడుగుపెట్టిన తెలుగు బిగ్ బాస్‌కు టైమ్ కలిసొచ్చినట్టు లేదు. గొడవలు, అరుపులతో ఇప్పుడిప్పుడే ఆట రసవత్తరంగా మారుతున్న సమయంలో లైవ్ స్ట్రీమింగ్ కు దెబ్బపడింది. బుధవారం అర్థరాత్రి 12 గంటల నుంచి లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది. లైవ్‌కు బదులు మళ్లీ నాగార్జున హోస్ట్ చేసిన మొదటి ఎసిపోడ్‌నే ప్రసారం చేయడం ప్రారంభించారు. మధ్యలో ఓ స్క్రోలింగ్‌ను ప్రసారం చేశారు. అందులో ‘మరింత వినోదాన్ని అందించేందుకు హౌస్‌ని రెడీ చేస్తున్నాం. మళ్లీ లైవ్ గురువారం అర్థరాత్రి 12 నుంచి ప్రసారం చేస్తాం. ఏ రోజుకి ఆరోజు పూర్తి ఎపిసోడ్ రాత్రి 9 గంటలకు విడుదల అవుతుంది. తప్పక చూడండి’ అని రాశారు.
దీన్ని బట్టి లైవ్ స్ట్రీమింగ్ లో ఏదో సమస్య వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే షో మొదలైనప్పటి నుంచి లైవ్ స్ట్రీమింగ్ స్లో అవ్వడం, కాసేపు ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వాటన్నింటినీ క్లియర్ చేసేందుకే ఇలా 24 గంటల గ్యాప్ తీసుకున్నట్టు సమాచారం. అంటే ప్రసారం జరిగిన రోజుకీ.. ఇంట్లో జరిగిన రోజుకు ఒక్కరోజు గ్యాప్ ఉండనుంది.