కూరల్లో కరివేపాకును తీసేసినట్లు కొందరు చికెన్లో తోలును తీసేసి తింటారు. మరి కొందరు అసలు ఆ తోలే వద్దని స్కిన్ లెస్ అంటూ తెచ్చుకుని వండుకుని తింటాం. ఈ సంస్కృతి ఇది వరకు పట్టణాల్లో ఉండేది. కానీ అది కాస్త ఇప్పుడు పల్లెలకూ పాకింది. కానీ ఆ తోలుతో కూడా కొన్ని ప్రయోజనాలు దాగున్నాయి. అయితే స్కిన్‌లెస్ వైపు మొగ్గు చూపించడానికి అపోహలు కూడా కారణంగా ఉన్నాయి.
కానీ కోడి తోలులో అసంపూర్తి కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవి రక్త పోటును నియంత్రించడానికి ఉపయోగపడతాయి. గుండె పనితీరును ఉత్సాహపరుస్తాయి కూడా. తోలుతో పాటు కోడిని తినాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముందుగా బొచ్చుపీకిన(ఈకలు) కోడిని బాగా కాల్చాలి. తర్వాత పసుపు రాసి మసాజ్ లాగా చేయాలి. ఇలా చేయడం ద్వారా.. కోడి తోలుపై ఉండే అన్ని రకాల సూక్ష్మజీవులు నశించబడతాయి. అనంతరం దాన్ని వండుకుని తింటే పైన వివరించిన మేలు చేకూరుతుంది.
అయితే అది కూడా మితంగా ఉంటే మంచిదంటున్నారు డాక్టర్లు. అదే పనిగా రోజూ తోలు ఉన్న చికెన్ తింటే ఒంట్లోకి భారీగా కొవ్వు చేరుతుంది. ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు కూడా పరిధికి మించి శరీరంలోకి అధికంగా చేరుతాయి. ఇలా జరిగితే ఇన్ ఫ్లమ్మేషన్ రావచ్చు. కాబట్టి వారానికి ఒకసారో, రెండు సార్లో తోలుతో వండి చికెన్ కూరను ఆస్వాదించవచ్చు. ఈ ప్రయోజనాలు తెలియని చాలా మంది స్టయిల్ గా, తోలు తీసిన చికెన్ తింటే గొప్పవాళ్ల మాదిరి ఊహించుకుంటూ చికెన్ తెచ్చుకుని తింటున్నారు. కాబట్టి తోలు ఉన్న చికెన్ ను తింటే అనర్ధాలే కాదు, ప్రయోజనాలూ ఉన్నాయి.