Site icon 123Nellore

టీడీపీ సభ్యుల ప్రవర్తన రౌడీలు, పోరంబోకులకన్నా హీనం : విప్ రామచంద్రారెడ్డి

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాసనసభ, శాసన మండలిలో టీడీపీ సభ్యులు ప్రవర్తన సరిగాలేదున్నారు. రోడ్లపై తిరిగే రౌడీలు, పోరంబోకుల కన్నా హీనంగా నడుచుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సిగ్గు, మానం, మర్యాద, సభ్యత, సంస్కారం, లజ్జ వంటివేమీ లేవంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల అనంతంరం బయట మీడియా పాయింట్ లో రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.

టీడీపీ సభ్యులకు సభా మర్యాదల కన్నా అల్లరి చేయడమే కావాలని విమర్శించారు. ప్రశ్నలు వాళ్లే వేస్తారు..సమాధానం లేదన్నట్లు వాళ్లే అల్లరి చేస్తారని మండిపడ్డారు. వీధి నాటకాలకు వేదికలా భావించి శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు విజిల్స్ వేశారని ఆక్షేపించారు. చిడతలు వాయిస్తూ సభా సాంప్రదాయాలను కాలగర్భంలో తొక్కుతున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇచ్చిన శిక్షణ ఇదేనా అని ప్రశ్నించారు. టీడీపీ  సభ్యులు ఇకనైనా మనుషుల్లాగా ప్రవర్తించడానికి ప్రయత్నించాలని హితవు పలికారు.

ఇలాగే ప్రవర్తిస్తే ఈ సారి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి ఎన్నిక కాబోరని తెలిపారు. అయితే మొన్నటి సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైతం లోకేష్ ను తీవ్ర పదజాలంతో దూషించిన విషయం అందరికీ తెలిసిందే. దానిపై లోకేష్ సైతం బుధవారం స్పందించి నారాయణ స్వామి వ్యాఖ్యలు వారి విజ్ఝతకే వదిలేస్తున్నామని అన్నారు. కనీసం ఆయన మాట్లాడిన దానికి క్షమాపణ కూడా చెప్పలేదన్నారు.  ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి ఈ విధంగా మాట్లాడటంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సభలో నోటికొచ్చినట్లు మాట్లాడటం సభను గౌరవించడమా అని ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version