ఇండియాలోకి డిస్కో డ్యాన్స్ కల్చర్ ప్రవేశపెట్టిన ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరి ఇక లేరు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని క్రిటీకేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. గతేడాది కరోనా బారిన పడిన ఈయన చాలా ఆలస్యంగా కోలుకున్నారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయని… క్రమంగా ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు వెల్లడించారు. చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు.
బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో బప్పి జన్మించారు. సంగీతం మీద మక్కువతో ఈ రంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్నో అద్భుతాలు సృష్టించారు. డిస్కో డ్యాన్స్ కల్చర్ ను భారతదేశంలో తొలిసారి ప్రవేశపెట్టింది ఈయనే. బప్పి అసలు పేరు అలోకేశ్ లహిరి. వివిధ భాషల్లోని ఎన్నో చిత్రాలకు సంగీతం స్వరపరిచిన బప్పీ… అప్పుడప్పుడు తెరపై కూడా కనిపించేవారు. అంతేకాకుండా డబ్బింగ్ కూడా చెప్పేవారు. తనదైన ప్రతిభతో సంగీతంలో తనదైన ముద్ర వేసుకున్న బప్పి… బంగారం ఎక్కువ ధరిస్తారు. అయితే అందుకు కారణం కూడా చెప్పారు. ఓ పాప్ సింగర్ ను చూసి.. తనకూ బంగారం వేసుకోవాలనే కోరిక కలిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన తల్లి, భార్య కూడా బంగారం ఉంటే అదృష్టమని నమ్ముతారని.. తనకు విజయాలు వచ్చిన కొద్దీ బంగారం రెట్టింపు అవుతూ వచ్చిందని ఆయన ఆ ఇంటర్వ్యూలో వివరించారు.
దిగ్గజ స్వరకర్త బప్పి మృతి పట్ల సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బప్పి ఆకస్మిక మరణంపై ప్రధాని మోదీ స్పందించారు. బప్పి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ముంబయిలో బప్పి అంత్యక్రియలు జరగనున్నాయి.