ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపై నందమూరి బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమల సమస్యలపై ఏపీ సీఎం జగన్‌తో తాను సమావేశం కానని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. బాలకృష్ణ చైర్మన్‌గా ఉన్న బసవతారకం ఆస్పత్రిలో చైల్డ్ హుడ్ క్యాన్సర్ డే సందర్భంగా ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందితో అన్ని విషయాలపై మాట్లాడారు. కొంత మంది సినిమా ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్ వద్ద జరిగిన సమావేశం గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ టిక్కెట్ రేట్ల విషయంలో తన అభిప్రాయం చెప్పారు.
సీఎం జగన్‌తో సమావేశానికి సినీ ప్రముఖులు తనను కూడా ఆహ్వానించారని వెల్లడించారు. అయితే, ఆ సమావేశానికి తాను రానని చెప్పానని బాలయ్య తెగేసి చెప్పారు. ఈ విషయంలో తనకు స్పష్టమైన విధానం ఉందని చెప్పుకొచ్చారు. సినిమాల విషయంలో రెమ్యూనరేషన్ పెంచనని, తన సినిమా బడ్జెట్‌ను కూడా పెంచబోనని వివరించారు. ఇలా చేసి నిర్మాతను ఇబ్బంది పెట్టే ఆలోచన తనకు ఉండదని వెల్లడించారు. సినిమా టికెట్ల ధరలపై గతంలోనే తాను కొన్ని సూచనలు చేశానని బాలకృష్ణ వెల్లడించారు. టికెట్ ధరలు తక్కువగా ఉన్నా కూడా అఖండ ఘన విజయం సొంతం చేసుకుందని అన్నారు . ఇక ఈ మీటింగ్‌కి జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కాలేదు.
కాగా ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ స్టార్ హీరోలు, ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. సీఎం జగన్‌ను కలిసి సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యలపై చర్చించారు. సీఎం జగన్‌తో భేటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్ వంటి క్రేజీ హీరోలు కూడా పాల్గొన్నారు.