విజయనగరం రామతీర్థ ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుకు, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీనిపై ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అశోక్ గజపతిపై కేసు నమోదు చేశారు. దీంతో, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది.
తాజాగా, తనపై నమోదు చేసిన ఎప్ఐఆర్పై హైకోర్టును ఆశ్రయించినట్లు అశోక్ గజపతిరాజు తెలిపారు. తనపై నమోదైన కేసులో పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారని.. 4వందల ఏళ్ల చరిత్ర కలిగిన రామతీర్థంలో ఎన్నడూ లేని విధంగా వైకాపా ప్రభుత్వ హయాంలో దారుణాలు చోటుచేసుకోవడం బాధాకరమని తెలిపారు. దేవుడికి సమర్పించే కానుకలకు కూడా మంత్రుల అనుమతి తీసుకోవాలని అంటుంటే ఆశ్చర్యమేస్తోందని అన్నారు.
ఈ క్రమంలోనే తన కుటుంబం, సంస్కారంపై వైకాపా మంత్రులు మాట్లాడిన తీరు బాధని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని దేశద్రోహి కింద లెక్కకట్టిన వారిని చూస్తుంటే.. వారి మెదడు ఏ రేంజ్లో పని చేస్తోందో అర్థమవుతూనే ఉందని అన్నారు.
ఆలయాలకు సంబంధించిన విషయాలు అడుగుతుంటే.. ఒక్కటి కూడా అధికారులు చెప్పట్లేదని.. సింహాచలానికి వెళ్లేముందు టోల్గేట్ కట్టే వెళ్తున్నానని.. పొరపాటున కట్టకపోతే.. అక్కడ కూడా కేసు పెడతారని భయమేస్తోందని.. తనను కేసులతో వేధిస్తున్నారని గజపతి ఆవేదన వ్యక్తం చేశారు.