విజయనగరం రామతీర్థం ఆలయ వివాదం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే తెదేపా సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. నెల్లిమర్ల మండల రామతీర్థంలో సంప్రదాయంగా జరగాల్సిన శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇష్టం వచ్చినట్లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం బోడికొండపై శ్రీరాముడి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనలో ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుకు, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీనిపై ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అశోక్ గజపతిపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన ఆయన.. దేవలయాల నిధులు ధార్మిక కార్యక్రమాలకు ఖర్చుచేయాలి.. కానీ, ప్రభుత్వం వాటిని ఏం చేస్తోందో తెలియట్లేదు. ప్రశ్నించిన నాపైనే కక్షగట్టి కేసులు పెట్టి నోర్లు మూయించాలని చూస్తున్నారు… గజపతి అని ఆరోపించారు.
ట్రస్ట్ నియమించిన ఆచారాలు, సంప్రదాయాలు అందరూ పాటించాలని.. కానీ, రామతీర్థం జరిగిన సంఘటన చూస్తే ఆశ్చర్యం వేస్తోందని అన్నారు. వైకాపా ప్రభుత్వం తనపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లుందని అభిప్రాయపడ్డారు. ఆలయ నిధులను ప్రభుత్వం ఇతర పనులకు ఉపయోగిస్తోందని.. గజపతి ఆరోపించారు.ఈ ఘటనపై తెదేపా నేత చంద్రబాబు సహా, పలువురు నేతలు స్పందించారు. అశోక్ గజపతికి సపోర్ట్‌గా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.