వైఎస్ జగన్ పాలనతో రాష్ట్రం నరకాంధ్రప్రదేశ్ గా మారిపోయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో రోజు వారీ ఘటనలు, పరిస్థితులు తీవ్ర అవేదన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు, దాడులు, అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులకు సంబంధించి 31 ఘటనలు జరగడం రాష్ట్రంలో దుస్థితికి అద్దంపడుతున్నాయని చంద్రబాబు అన్నారు.
మరోవైపు రోజు రోజుకూ పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు తీవ్ర అందోళన కరమని చంద్రబాబు అన్నారు. గత ఏప్రిల్ నెలలో 26 మంది రైతులు అప్పులు బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని…అసలు వ్యవసాయ శాఖ అనేది ఉందా అనే అనుమానం కలిగేలా పరిస్థితి ఉందని అన్నారు. నెలలో 26 మంది రైతుల బలవన్మరణాలు జరిగినా…ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదని చంద్రబాబు విమర్శించారు.
ఇక రాష్ట్రంలో ప్రభుత్వ నిర్ణయాలు, అసమర్థత కారణంగా ఉపాధి రంగం తీవ్రంగా దెబ్బతిందని టీడీపీ అధినేత అభిప్రాయ పడ్డారు. ఈ కారణంగా ఉపాధి కోసం యువత, ఆయా వర్గాల ప్రజలు వలసపోతున్నారని చంద్రబాబు అన్నారు. ఈ పరిణామం భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. మహిళలపై దాడులు -నేరాలు, వ్యవసాయ రంగం సంక్షోభం – రైతుల ఆత్మహత్యలపై పార్టీ పరంగా రెండు వేరు వేరు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు వర్గాల సమస్యలు, పోరాటం, పరిష్కారం కమిటీ సూచనల ఆధారంగా టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.