Site icon 123Nellore

మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం..

ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. వైద్యులు గౌతమ్‌రెడ్డిని ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు. దీంతో ఆసుపత్రి వైద్యులు భార్యకు సమాచారం అందించారు.

కాగా మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి. 1971 నవంబర్‌2న జన్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్‌ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ కేబినెట్లో మొదటి సారి మంత్రి అయ్యారు. వారం రోజులపాటు దుబాయ్‌లో పర్యటించి పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్న మేకపాటి ఆదివారమే హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఇటీవలే కోవిడ్‌ బారిన పడి కూడా కోలుకున్నారు.

గౌతమ్ మరణ వార్త రాజకీయ ప్రముఖులను దిగ్ర్భాంతికి గురి చేసింది. ఈయన స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి. ప్రస్తుతం వైసీపీలో ప్రముఖపాత్రను గౌతమ్ రెడ్డి పోషిస్తున్నారు. వివాదరహితుడిగా ఆయన మంచి పేరు ఉంది. ఈయన మరణంతో మేకపాటి కుటుంబం, నెల్లూరు జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృత దేహాన్ని నెల్లూరుకు తీసుకొచ్చి, అంత్యక్రియలు జరిపేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి మరణం పట్ల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు, టీడీపీ అధినేత చంద్రబాబు, అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు సంతాపం తెలిపారు.

Exit mobile version