ప్రముఖ సినీ నటుడు మహేష్‌బాబు హీరోగా నటించిన కొత్త సినిమా సర్కారు వారిపాట. అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా విడుదలైనప్పటి నుంచి 10 రోజులు టికెట్ల ధరలు పెంచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.
సినిమా టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్ శుక్రవారం జీవో జారీ చేశారు. సినిమా విడుదలైనప్పటి నుంచి 10 రోజుల పాటు టికెట్లపై రూ. 45 మేర పెంచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా సినిమాల విడుదలకు ముందు సదరు సినిమా నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని కలిసి తమ బడ్జెట్‌ను చూపి సినిమా టికెట్ల రేట్ల పెంపునకు అభ్యర్థిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సర్కారువారి పాట సినిమా యూనిట్ కూడా ఏపీ ప్రభుత్వాన్ని టికెట్ల రేట్ల పెంపునకు అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను పరిశీలించిన ఏపీ సర్కారు… సర్కారువారి పాట సినిమా టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి మంజూరు చేసింది. దీంతో సర్కారు వారి పాట చిత్ర యూనిట్ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల తరహాలో సర్కారు వారి పాట సినిమాకు కూడా థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్ రేట్లు పెంచనున్నాయి. ఇక సర్కారు వారి పాట విషయానికి వస్తే.. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించగా.. నదియా, సముద్ర ఖని, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని జీఏంబీ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.