Site icon 123Nellore

ఆర్ఆర్ఆర్ మూవీకి గుడ్ న్యూస్.. టికెట్‌ రేట్ల పెంపుకు గ్రీన్‌ సిగ్నల్‌..!

ఏపీ ప్రభుత్వం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందానికి శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, పారితోషికాలు కాకుండా వంద కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలు టికెట్ రేట్లు పెంచుకోవడంపై దరఖాస్తు చేసుకుంటే కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం కూడా ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపైనే ప్రభుత్వం తాజా నిర్ణయం వెలువరించింది.

కొత్తగా తెచ్చిన జీవో ప్రకారం టికెట్ రేటుపై అదనంగా రూ.75 వరకు పెంచుకునేందుకు అనుమతించింది. సినిమా విడుదలైన మొదటి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. దర్శకుడు, నటీనటుల పారితోషికం కాకుండా చిత్ర నిర్మాణానికి రూ. 100 కోట్లు బడ్జెట్‌ దాటితే.. విడుదలైన 10 రోజులపాటు టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశాన్ని జీవో నెం. 13లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వమని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.

ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెన్సార్‌ పూర్తయింది. U/A సర్టిఫికేట్‌ పొందిన ఈ సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. అలియా భట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఎం. ఎం. కీరవాణి స్వరాలందించారు. కొవిడ్‌ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. మార్చి 25న ప్రేక్షకుల ముందుకురానుంది.

Exit mobile version