Site icon 123Nellore

ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతోంది : టీడీపీ అధినేత చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆర్థిక సంక్షోభంతో ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని వద్ద జరిగిన కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వ విధానాలతో ఏపీ కూడా తీవ్ర సంక్షోభం దిశగా ప్రయాణిస్తోందని ప్రధానితో వివిధ శాఖల అధికారులు చెప్పిన విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సి ఉందని చంద్రబాబు అన్నారు.  రాష్ట్రంలో జగన్ వ్యక్తిగత ఆదాయం కోసమే…ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇసుక, మద్యం దొపిడీ, నిత్యావసరాల భారం వెనుక జగన్ దోపిడీ ఉందన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు.

సహజ వనరుల దోపీడీకి పాల్పడుతున్న జగన్….ప్రభుత్వానికి ఆదాయం కోసం విపరీతంగా పన్నులు వేస్తున్నారని, అప్పులు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉండే ఏపీలో ఇప్పుడు కరెంట్ ఎందుకు పోతోందని చంద్రబాబు ప్రశ్నించారు. కరెంట్ కోతలకు, పెరిగిన విద్యుత్ బిల్లులకు ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో జరిగిందని…. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరవాత ఇప్పుడు చేసిన తప్పులను సరిదిద్దుతామని చంద్రబాబు అన్నారు.

జిల్లాలు, రెవెన్యూ డివిజన్ ల ఏర్పాటుపై  ప్రజల అభ్యంతరాలను, నిరసనలను కనీసం పరిణగలోకి తీసుకోకపోవడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో పలు అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో కరెంట్ చార్జీల రేట్లు పెంచడం, నిత్యావసర ధరలు, చెత్తపన్ను, పెట్రో మంట, భారమైన గ్యాస్ ధరలపై గ్రామ స్థాయిలో బాదుడే బాదుడు పేరుతో టీడీపీ ఇంటింటికి వెళ్లాలని నిర్ణయించారు. ధరలు పెంచి ఒక్కో కుటుంబంపై రూ.లక్షల్లో భారం వేస్తున్నారు. జగన్ ప్రభుత్వ బాదుడు కారణంగా పేదలపై ఎంత భారం పడుతుంది అనే విషయాలను కరపత్రాల ద్వారా ప్రచారం చెయ్యనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలని నిర్ణయించారు.

 

Exit mobile version