Site icon 123Nellore

విశ్వక్‌ సేన్ క్షమాపణ.. హీరోపై మంత్రికి ఫిర్యాదు చేసిన యాంకర్

Vishwak Sen Requests Audience About AVAK OTT Release Posts

విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస వివాదాలపాలవుతున్నాడు. మొన్నటికి మొన్న నడిరోడ్డుపై ఫ్రాంక్ వీడియో చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురికావడమే కాకుండా న్యూసెన్స్ కేసు నమోదు అయ్యేలా చేసుకున్నాడు. ఇక నిన్నటికి నిన్న ఒక ప్రముఖ ఛానల్‌కు ఇంటర్వ్యూకు వెళ్లి యాంకర్‌పై అసభ్య పదజాలంతో నోరుపారేసుకుని వార్తల్లో నిలిచాడు. ఇదంతా ఎందుకు అంటే నా సినిమా ప్రజలలోకి వెళ్ళడానికి ఏదైనా చేస్తా అని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

టీవీ డిబేట్‌లో అభ్యంతరకర పదం వాడటం గురించి విశ్వస్‌ సేన్‌పై నెట్టింట ట్రోల్స్‌ ఎక్కువయ్యాయి. వరుస వీడియోలు, పోస్టులు, మీమ్స్‌తో హోరెత్తించారు నెటిజన్లు. ఆ పదం వాడటం పై ఓ ప్రెస్‌మీట్‌లో విశ్వక్ స్పందించారు.​ ‘దెబ్బ తగిలినప్పుడు అమ్మా అన్నట్టే.. ఆ పదం అలా వచ్చింది. ఇప్పట్లో చిన్న పిల్లలకు, 16 ఏళ్ల వయసున్న యూత్​కు వద్దన్నా ఆ పదం వచ్చేస్తోంది. కానీ మీడియాలో ఆ పదం వాడినందుకు క్షమించండి’ అని విశ్వక్ సేన్ అన్నారు. అయితే ఇందులో ప‌బ్లిసిటీ వుందో లేదో కానీ.. మొత్తానికి విశ్వక్ సేన్ అనుకున్న‌ట్లు ప‌బ్లిసిటీ వ‌చ్చేసింది. పైగా.. నా సినిమాకు నేను ఇలాగే ప‌బ్లిసిటీ చేసుకుంటాన‌ని చివ‌ర్లో ఆయన ట్విస్ట్ ఇవ్వ‌డం విశేషం.

విశ్వక్‌సేన్‌ నటించిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రం మే 6న విడుదలకానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ నడిరోడ్డుపై అతడు ఓ ప్రాంక్‌ వీడియోను చేశాడు. ప్రమోషన్‌ పేరిట న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారనే ఉద్దేశంతో టీవీ ఛానల్‌ డిబేట్‌ నిర్వహించి, దానికి విశ్వక్‌ను ఆహ్వానించింది. ఈ క్రమంలోనే యాంకర్‌, విశ్వక్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే దీనిపై ఆ చానల్ యాంకర్ దేవి నాగవల్లి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దేవి ఫిర్యాదుపై మంత్రి తలసాని స్పందించారు. ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఓ సినిమా గురించి ప్రమోషన్స్ నిర్వహించుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. అలాకాకుండా ప్రాంక్ వీడియోల పేరిట రోడ్లపై ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, దీనిపై తాను పోలీసు అధికారులతో మాట్లాడతానని వెల్లడించారు. ప్రస్తుతం విశ్వక్ వివాదం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Exit mobile version