తిండిలేని వాడు ఆకలితో చస్తే..తిన్నవాడు అరక్క చచ్చాడని ఓ నానుడి ఉంది. జుట్టు లేని వాళ్లు లేదని బాధపడుతుంటే ఉన్నవాళ్లు దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. జుట్టు రాలే సమస్యతో పాటు చుండ్రు సమస్య కూడా అధికమందిని ఇబ్బంది పెడుతోంది. ఈ చుండ్రు రావడానికి గల సరైన కారణాలు ఇప్పటికీ లేవు. సహజంగా జిడ్డుగా ఉండే తలలో ఎక్కువగా చుండ్రు సంభవిస్తుంది. కొందరికి స్నానం చేసే నీరు వల్ల కూడా చుండ్రు వస్తుంది. ఒక్కో రకమైన చుండ్రు సమస్యకు ఒక్కో విధమైన కారం ఉంటుంది.
ఈ చుండ్రు ఎక్కువైనప్పుడు దుస్తులపై తెల్లటి పొట్టు రాలడం, ఎంత తలస్నానం చేసినా దురదగా ఉండడం తలమీద చిన్ని కురుపులు కూడా వచ్చి, ముఖం జిడ్డుగా మారి, మొటిమలతో బాధిస్తుంటుంది. దీన్ని కొన్ని చిట్కాలతో ఎలా తగ్గించుకోవాలో చూడండి. మెంతులను మెత్తగా పొడిగా చేసుకుని జల్లి పట్టుకోవాలి. ఆ జల్లిపట్టుకున్నదాన్ని మీగడ లేదా పెరుగుతో చూర్ణం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. సుమారు గంట తర్వాత శుభ్రంగా తల స్నానం చేస్తే చుండ్రు నుండి విముక్తి పొందడంతో పాటు జుట్టు పెరగడంతో పాటు నాజూగ్గా కూడా ఉంటుంది.
యాంటీ డాండ్రఫ్ షాంపులు అనేక విధాలుగా ఉన్నా వాటిల్లో తెలివిగా మంచి మన్నికైన షాంపును ఎంపిక చేసుకోవాల్సి ఉంది. మంచి నాణ్యమైన షాంపును ఎంపిక చేసుకుంటే ఇది తలలో తెల్లగా ఏర్పడే పొట్టును నివారించి తలను శుభ్రంగా ఉంచుతుంది. పెరుగు మరియు నిమ్మరసంతో ఉత్తమ హోం రెడీమేడ్ చేసుకోవచ్చు. పెరుగులో కొంత నిమ్మరసం కలపుకుని తలకు పట్టించాలి. దాన్ని అరగంట పాటు అలాగే వదిలేసి తర్వాత మంచినీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో 3 నుండి 4సార్లు చేస్తేం ఫలితం ఉంటుంది. పెరుగు లేని వాళ్లు ఒట్టి నిమ్మరసాన్ని తలకు పట్టించి కాసేపు ఆరబెట్టి స్నానం చేసినా చుండ్రు తగ్గుతుంది.