Site icon 123Nellore

పాన్‌ ఇండియా అనేది నాన్‌సెన్స్: హీరో సిద్ధార్థ్

చుట్టూ వివాదాలతో ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గా నిలుస్తుంటారు హీరో సిద్ధార్థ్. గతంలో తెలుగు ఇండస్ట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. తెలుగు సినిమాకు చాలా కాలం దూరం అయిన సిద్ధార్థ్.. ఇప్పుడు మరో సారి నోటి దురుసు చూపించారు. ఈసారి ఏకంగా పాన్ ఇండియా సినిమాలపైన పడ్డాడు. సినీ పరిశ్రమలో ఇప్పుడు పాన్ ఇండియా అనే పదం వాడకం ఎక్కువయింది. ఈ పదాన్ని వాడటంపై హీరో సిద్ధార్థ్ ఘాటుగా స్పందించారు.

పాన్‌ఇండియా అనేది ప్రాంతీయ భాషా సినిమాలను అగౌరవపరిచే పదమని అంటున్నారు సిద్ధార్థ. ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ నుంచి వస్తుందని, పాన్‌ ఇండియా సినిమా అంటే సౌత్‌ నుంచి వస్తుందన్న భావన దీనివల్ల కలుగుతోందన్నారు. అసలు ఏ సినిమా అయినా ఇండియన్‌ సినిమాయే అవుతుందని స్పష్టం చేశారు సిద్ధార్థ్‌. తాను 15 ఏళ్ల కిందట ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో క్రాస్‌ఓవర్‌ సినిమా అనే టాపిక్‌ నడిచేదని, హాలీవుడ్‌ రేంజ్‌కు ఎప్పుడు చేరుకుంటామని అడిగేవారని గుర్తు చేసుకున్నారు.

“నన్నడిగితే పాన్‌ ఇండియా అనే పదాన్ని తొలగించాలనే చెప్తా. ఏ చిత్రాన్నైనా ఇండియన్‌ ఫిల్మ్ అనే పిలవాలి లేదా ఏ భాషలో రూపొందితే ఆ భాషా చిత్రంగా పరిగణించాలి. ఉత్తమ ప్రతిభ కలిగిన వారే మంచి చిత్రాలు తీయగలరు. అలాంటి వారు ఏ పరిశ్రమలో పనిచేసినా తమదైన ముద్రవేస్తారు. తమిళనాడుకు చెందిన ఎంతోమంది సాంకేతిక నిపుణులు, టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు, కన్నడ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హిందీ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. కంటెంట్‌ బాగుంటే సినిమాకు ఎలాంటి కొత్త పేర్లను పెట్టాల్సిన అవసరం లేదు’’ అని సిద్ధార్థ్‌ పేర్కొన్నాడు.

Exit mobile version